ఎంతటి కమనీయ దృశ్యం. నీలమేఘశ్యాముడు కొలువైన అయోధ్యలో రామాలయ నిర్మాణం. వందల ఏళ్లనాటి కల తీరుతున్న వేళ. ఎంత శుభతరుణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసు ఎంతగా ఉప్పొంగిపోతుందో. అయోధ్యను మనసారా ఒక్కసారి దర్శించి తనివితీరా జై శ్రీరామ్ అంటూ నినదించాలని… ఎన్ని కోట్ల గుండెల తహతహలాడుతున్నాయో. నిజమే.. ఆ నల్లనయ్య పుట్టిన చోట మందిరం కట్టేందుకు హిందువులు ఎంతగా పరితపిస్తున్నారు. ఇది ఇప్పటి స్వప్నం కాదు. 1528 నుంచి సాగుతున్న న్యాయపోరాటం. అగస్టు 5వ తేదీన ఆలయానికి భూమి పూజ చేయబోతున్న వేళ అయోధ్య గురించి కొన్ని అంశాలు.
సరయూ నది తీరాన అయోధ్య పట్టణం. కోసల దేశరాజధాని. సూర్యవంశీకులు ప్రభువులు. త్రేతాయుగంలో ఇక్కడ నుంచే రాముడు పరిపాలన సాగించాడనే గొప్ప నమ్మకం. కానీ.. మొఘలుల దండయాత్రలో బాబర్ సేనాపతి మీర్‌బాకీ 1528లో రామాలయాన్ని కూలగొట్టారు. అక్కడ బాబ్రీమసీదు నిర్మించారని చరిత్ర చెబుతుంది.
1822లో పైజాబాద్ కోర్టులోని ఓ ఉన్నతాధికారి మొదట రామాలయంపై మసీదు నిర్మించారని చెప్పారు. దీనిపై నిర్మోహి అఖాడా అనే వ్యక్తి గుడికట్టుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
1855లో తొలిసారిగా హిందు-ముస్లిం ఘర్షణలు జరిగాయి. అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం 1859లో రెయిలింగ్ ఏర్పాటు చేసింది.
దీంతో 1949 వరకూ ఎటువంటి గొడవలకూ అవకాశం లేకుండా పోయింది.
1949లో వీహెచ్‌పీ కార్యకర్తలు మసీదు ప్రాంగణంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది కాస్త గొడవగా మారి కోర్టుకు చేరింది. 1986లో పైజాబాల్ న్యాయమూర్తి కట్టడం తలుపులు తెరచి పూజలు చేసుకోవచ్చని చెప్పింది.
1980 తరువాత వీహెచ్‌పీ జోక్యం చేసుకోవటం.. క్రమంగా రాజకీయరంగు పులుముకోవటం.. బీజేపీకు బలంగా మారింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎజెండాగా కమలం చక్రం తిప్పింది.
1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ ఎల్ కే అధ్వాణీ రథయాత్ర చేపట్టారు. ఈ సమయంలోనే బాబ్రీమసీదుకు కరసేవలకులు కదిలారు. కూల్చారు. మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నించిన 20 మంది కరసేవకులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆ తరువాత క్రమంగా భాజపా బలపడుతూ రావటంతోపాటు.. ఆలయ నిర్మాణానికి మద్దతు పెరుగుతూ వచ్చింది. గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రామమందిర నిర్మాణం చేపట్టేందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనికి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తంగాకపోవంతో 2020 అగస్టు 5న భూమి పూజకు సిద్ధమైంది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో తలపెట్టిన రామాలయం ప్రపంచంలోనే మూడో అతిపెద్దది. సుమారు 67 ఎకరాల్లో రామాలయ నిర్మాణం విస్తరించింది. 2.77 ఎకరాల్లోనే ప్రధాన ఆలయం ఉంటుంది. 10,000 మంది భక్తులకు అనుకూలంగా నిర్మాణం చేపడుతున్నారు. 27 నక్షత్రాల కు సూచికగా 27 రకాల మొక్కలను ఇక్కడ నాటుతారు. అక్కడకు వచ్చిన భక్తులు తమ రాశికి అనుగుణంగా ఉన్న చెట్టుకింద కూర్చుని ధ్యానం చేసుకునే సౌలభ్యం ఉంది.
ఆలయం పొడవు 300 అడుగులు.. ఎత్తు 161 అడుగులు. వెడల్పు 280 అడుగులు. ఐదు మండపాలుంటాయి. పునాది 15 అడుగుల లోతు నుంచి వెయ్యనున్నారు. 1000 ఏళ్లపాటు భూకంపాలు, ప్రకృతి విపత్తుల నుంచి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయం నిర్మిస్తున్నారు.
రామాలయ శంకుస్థాపనకు తొలి ఆహ్వానితుడు ఇక్బాల్ అన్సారీ. ట్రస్టు తరపున ఆహ్వానం అందుకున్న ఇతడు తప్పకుండా భూమి పూజకు వెళ్తానంటున్నాడు.
ఎల్‌కే అధ్వాణీ, మురళీమనోహర్ జోషి ఇద్దరూ వయోభారం వల్ల వీడియో ద్వారా వీక్షించనున్నారు.