వానాకాలం వచ్చేసింది.. ఆగితే తప్పేంటి?

వానాకాలం వచ్చేసింది.. ఆగితే తప్పేంటి?

ఏంటి వానలు పడకుండా ఆగిపోవాలని అంటున్నాడు.. వీడెవడండీ బాబూ.. అనుకుంటున్నారా. మీరు చదివింది కరెక్టే. కానీ దాని భావం వేరే.

ఇప్పుడు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేశాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడం.. వెంటనే వర్షాలు ఆగిపోయి ఎండ కాయడం రెండూ జరిగిపోయాయి. ఏది ఏమైనా ఇది వర్షాకాలం.

అసలే దేశంలో కరోనా కట్టడి కావడం లేదు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం మనకు చేతకావడం లేదు. ఈ సమయంలో వర్షంలో తడిశారే అనుకోండి.. అహ.. అనుకోండి. రెండు తుమ్ములు చాలు.. మీ జీవితాన్ని మార్చేయడానికి. ఛిన్నాభిన్నం చేయడానికి. అందుకే ఆగమంటున్నది.

ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ఉద్యోగులు చాలా మందే ఉంటారు. వానొచ్చినా, వంగిడొచ్చినా వాళ్లకు తప్పదు. కొలువుకు వెళ్లాల్సిందే. లేదంటే జీతంలో కోత అటుంచితే.. ఉద్యోగమే ఊడిపోయే పరిస్థితులు దాపురించాయి. కాబట్టి వాళ్లు వాళ్ల టైమింగుకు ఆఫీసులకు వెళ్లాల్సిందే. ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేయాల్సిందే. అయితే.. వెళ్లేటప్పుడు కానీ.. వచ్చేటప్పుడు కానీ.. వర్షం పడుతంటే కాస్త ఆగడం మంచిది. ఇదే చెప్తున్నది.

గతంలో సన్న చినుకులు పడుతుంటే.. ఆ( ఏముందిలే అని బైకుపై చెక్కేసేవారు. ఈ కరోనా కష్టకాలంలో ఆ దూకుడే వద్దంటున్నది. ఇంట్లోనో, ఆఫీసులోనో, రోడ్డుపక్కన బస్టాపులోనో ఆగండి. వర్షం పడేదాకా ఆగండి. నిమిషాలు కావచ్చు. గంట కావచ్చు. రెండు గంటలు కావచ్చు. ఆగడమే మంచిది. కాదని బయల్దేరారో.. పది నిమిషాల్లో గమ్యం చేరుకుంటామని భావించారో.. మీరు వెళ్తారు. ఆ తర్వాత వచ్చే తుమ్ముల్ని, జలుబుని, ఆ తర్వాత వచ్చే కరోనా అనుమానాల్ని, ఆ విపరిణామాల్ని తట్టుకోవడం మీ తరం కాదు.
సో, వర్షాకాలంలో వర్షం పడుతుంది. ఇందులో వింతేమీ లేదు. కరోనా కష్టకాలాన్ని, మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని.. చినుకు పడితే ఎక్కడికక్కడ ఆగిపోవడం ఉత్తమం.
లేదు ఆగం అంటారా.. ఆగమయ్యేది మీరే. ఆలోచించుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here