ఎటుచూసినా రామనామ జపమే. ఏ నోట విన్నా రఘురాముడి మంత్రమే. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కనులపండువగా సాగింది. హైందవధర్మానికి నాడు చత్రపతి శివాజీ జెండాపాతితే.. దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడగా నరేంద్రమోదీ నిలిచారు. 29 సంవత్సరాల క్రితం అంటే 1992 నరేంద్రుడు తొలిసారిగా అయోధ్యను దర్శించారు. రామమందిర నిర్మాణం చేపట్టిన తరువాతనే మళ్లీ ఇక్కడకు వస్తానంటూ ప్రతినబూనారట. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే.. సీతారాముల ఇష్టమైన అయోధ్యలో మందిరాన్ని నిర్మించే ఉత్తమ క్రతువుకు పెద్దగా పూజ చేశారు. పారిజాత మొక్కను నాటారు. ఇది కేవలం అయోధ్యకే పరిమితం కాలేదు.. విశ్వమంతా వ్యాపించిన హిందువులకు ఈ రోజు నిజమైన పండుగ. ప్రతి ఇల్లూ.. మామిడి తోరణాలతో.. దీపారాదనలతో కళకళలాడింది. దీపావళి, ఉగాది, సంక్రాంతి, దసరా అన్నీ ఒకేసారి వచ్చాయనేంత సంబరాలు జరుపుకున్నారు. ఇకపోతే అయోధ్యలో రమణీయమైన ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్‌భగవత్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, గవర్నర్ ఆనంద్‌బిన్, మతపెద్దలు, పీఠాధిపతులు ఎందరో పూజాదిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ప్రధాని హోదాలో అయోధ్యను దర్శించిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే. పక్కనే ఉన్న హనుమాన్ గడీ ఆలయాన్ని దర్శించుకున్న ప్రధాని కూడా నరేంద్రుడే. మోదీ ప్రసంగంలోనూ ఆధ్యంతం.. రామనామస్మరణతోనే సాగింది. ఇప్పుడు మనం పలికే రామనామం ఆ రాముడుకి చేరకపోవచ్చు. కానీ.. కోటాను కోట్ల మంది భక్తులకు వినిపిస్తాయంటూ.. రామమందిర నిర్మాణానికి ప్రాణత్యాగం చేసిన వారికి 135 కోట్ల మంది తరపున ధన్యవాదాలు అర్పిస్తున్నానంటూ ఉత్తేజంగా ప్రసంగించారు. రాముడు స్పూర్తితోనే భారతీయ పాలన సాగుతుందంటూ స్పష్టంచేశారు.