ఏసీ గదుల్లో ఎప్పుడూ సురక్షితంగా ఉండే ప్రముఖులనూ వైరస్ వదలట్లేదు. ఒక వైరస్ కాదు.. రెండు మూడు వైరస్‌లను మిక్సీలో వేసి కలిపితే పుట్టిందే కరోనా. అందుకే.. దాని తీవ్రతను అంచనావేయలేకపోతున్నారు. వ్యాక్సిన్ తయారు చేసినా అదెలా పనిచేస్తుందనే దానికి లెక్కలు కట్టలేకపోతున్నారు. ఈ లోపుగా వైరస్ అందర్నీ చుట్టేస్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నట్టుగానే దానితో సహజీవనం చేయాల్సిందే. విల్లాలు.. అధునాత భవంతుల్లో ఉండేవారినే వైరస్ వెంటాడుతున్నపుడు సామాన్యులెంత. ప్రజల మధ్య.. సమావేశాలతో హడావుడి చేసే మంత్రులు కూడా దీన్నుంచి తప్పించుకోలేకపోతున్నారు. పైగా చాలామంది ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ఏపీ ఉపసభాపతి కోన రఘుపతి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇలా చాంతాడంత జాబితా ఉండనే ఉంది. అమితాబ్ కరోనా నుంచి బయటపడి సురక్షితంగా ఇల్లు చేరినా ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ మంత్రి పద్మారావుగౌడ్, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకు వైరస్ సోకింది. ఏకంగా హోమంత్రి మహమూద్ అలీ కూడా దాదాపు వారం రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.
వైరస్ గురించి సోషల్ మీడియాలో సరదాగా చమత్కరించినట్టు. దానికి ఎటువంటి రిజర్వేషన్లు లేవు. ఎవ్వర్నీ వదలకుండా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నట్టు అనిపించినా వెంటనే కౌగిలించుకుంటుంది. కుల, మత, ప్రాంతీయ, ధన, పేద అనే బేధం లేకుండా అందర్నీ కమ్మేస్తుంది. వారిలోని రోగనిరోధకశక్తి(ఇమ్యూనిటీ) తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ప్రాణాలను కబళిస్తుంది. మొన్న మాజీ మంత్రి మాణిక్యాలరావు, నిన్న యూపీ విద్యాశాఖ మంత్రి కమలారాణి కరోనా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండి కూడా వారిని కాపాడుకోలేకపోయామంటూ వైద్యాధికారులు ఆవేదన వెలిబుచ్చారు. కాబట్టి.. సామాన్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
వైరస్ లక్షణాలు కనిపించగానే చికిత్స ప్రారంభించాలంటున్నారు వైద్యనిపుణులు. జ్వరం, దగ్గే కదా! అని
నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నగరాలు, పట్టణాల నుంచి పల్లెకు పాకిన వైరస్‌తో గ్రామీణులు మరింత అప్రమత్తంగా ఉండాలి. వైద్యసౌకర్యాలు సరిగాలేని చోట ముందుజాగ్రత్తలే శ్రీరామరక్షగా వైద్యులు సూచిస్తున్నారు.