కోవిడ్-19 కారణంగా హైదరాబాద్‌లో 60% పైగా వినియోగదారులు ఆదాయాన్ని నష్టపోయారు: పైసాబజార్ సర్వే నివేదిక
హైదరాబాద్, అక్టోబర్ 22: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆదాయాలను నష్టపోవడం అలాగే రుణాల తిరిగి చెల్లింపు సామర్థ్యం విషయంలో అత్యధికంగా ప్రభావితమైన నగరాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ మరియు ముంబై ఉన్నాయి. రుణ ప్రోడక్టులకు భారత్‌లో అతిపెద్ద డిజిటల్ మార్కెట్‌ప్లేస్ అయిన పైసాబజార్.కామ్ విడుదల చేసిన వినియోగదారుల అభిప్రాయ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. టాప్-5 మెట్రోల్లో అత్యధికంగా ప్రభావితమైన మూడో నగరం హైదరాబాద్ కాగా, అత్యంత తక్కువ ప్రభావం ఉన్న నగరంగా చెన్నై నిలిచినట్లు సర్వే పేర్కొంది.
35కు పైగా నగరాల నుంచి రూ.1 లక్ష అంత కంటే ఎక్కువ రుణం కలిగిన 24 నుంచి 57 ఏళ్ల వయసున్న 8,500 మందికి పైగా పైసాబజార్.కామ్ వినియోగదారులు ‘రుణాల లావాదేవీలు: భారత్‌లో ఈఎంఐల చెల్లింపు ప్రణాళికలు ఎలా ఉన్నాయి’ అనే పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఈ సర్వే ప్రకారం, కోవిడ్ సంబంధిత నియంత్రణల కారణంగా స్వయం ఉపాధి పొందుతున్న కస్టమర్లలో 86% మందికి పైగా తమ ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది. వాస్తవానికి, స్వయం ఉపాధి పొందుతున్న వారిలో నాలుగోవంతుకు పైగా కస్టమర్లు మహమ్మారి మరియు లాక్‌డౌన్ వల్ల తమ ఆదాయాలు పూర్తిగా ఆవిరైపోయాయని పేర్కొన్నారు. వేతనాలను పొందే కస్టమర్లపై ప్రభావం కాస్త తక్కువే అయినప్పటికీ, తీవ్రత మాత్రం అధికంగానే ఉంది. మహమ్మారి అలాగే దీని ఫలితంగా విధించిన నియంత్రణల వల్ల తమ జీతాలపై ప్రభావం పడిందని వేతనజీవుల్లో 56% మంది వెల్లడించారు; ఇక 12% మంది వేతనజీవులు తమ ఉద్యోగాలను కోల్పోయామని అలాగే తమకు ఎలాంటి ఆదాయ మార్గాలు లేవని చెప్పినట్లు సర్వే నివేదిక పేర్కొంది.
‘‘మహమ్మారి వెలుగుచూసిన తొలి 2-3 నెలల్లో వినియోగదారులపై విస్తృతమైన ప్రభావం ఉండగా, జూలై నుంచి స్థిరమైన రికవరీ ఉన్నట్లు మేం భావిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మళ్లీ కోలుకోవడం ప్రారంభం కావడంతో, తీవ్రంగా ప్రభావితమైన ట్రావెల్, విమానయానం, వినోదం, ఆతిథ్యం మొదలైన పరిశ్రమలకు చెందిన కస్టమర్ల విభాగాల ఆదాయాలు క్రమంగా పుంజుకోవడం మొదలైంది. ఈ విభాగాలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులతో పాటు పెద్ద రుణదాతల్లో నమ్మకం కూడా పెరిగింది. అయితే, తక్కువ ఆదాయ విభాగాలు మరియు స్వయం ఉపాధి వర్గాలకు రుణాల సరఫరాలో రికవరీకి మాత్రం దీర్ఘకాలమే పడుతుంది’’ అని పైసాబజార్.కామ్ సీఈఓ & సహ-వ్యవస్థాపకుడు నవీన్ కుక్రేజా పేర్కొన్నారు.
ఢిల్లీ మరియు ఎన్‌సీఆర్, అత్యధికంగా ప్రభావితమైన నగరాలుగా నిలిచాయని సర్వే వెల్లడించింది, ఈ ప్రాంతాల నుంచి సర్వేలో పాల్గొన్న నివాసితుల్లో 70% మంది తమ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు చెప్పారు. వీరిలో ఎన్‌సీఆర్‌కు చెందిన 16% మంది కస్టమర్లు మహమ్మారి మరియు సంబంధిత అవరోధాల కారణంగా తమ ఆదాయాలు సున్నా స్థాయికి పడిపోయాయని కూడా వెల్లడించారు. అయితే, పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయిన కస్టమర్లకు సంబంధించి శాతాన్ని చూస్తే, ముంబై అత్యంత దుర్భరమైన స్థానంలో ఉంది. 26% మంది ముంబై వాసులు తాము పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయామని పేర్కొన్నారు. అదేవిధంగా మారటోరియంను తీసుకున్నవారిలో అత్యధిక శాతం మంది కూడా ముంబైలోనే ఉన్నారు. సర్వేలో పాల్గొన్న ముంబై నగరానికి చెందిన కస్టమర్లలో 65% మంది రుణ మారటోరియంను తీసుకున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ విషయానికొస్తే, పైసాబజార్.కామ్ సర్వేలో పాల్గొన్న నగరవాసుల్లో 63% మంది మహమ్మారి కారణంగా తమ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడిందని వెల్లడించారు; 20% మంది తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయారు. స్వయం ఉపాధి పొందుతున్న హైదరాబాద్ వాసుల్లో సుమారు 80% మంది, అలాగే నగరానికి చెందిన వేతనజీవుల్లో 58% మంది ఆదాయ నష్టాన్ని చవిచూసినట్లు సర్వేలో వెల్లడైంది.
కోవిడ్-19 & లాక్‌డౌన్ కారణంగా ఆదాయ ప్రభావంపై నగరాల వారీగా విశ్లేషణ
| నగరాలు | ఆదాయాన్ని నష్టపోయిన వినియోగదారుల శాతం | 100% ఆదాయాన్ని నష్టపోయిన వినియోగదారుల శాతం |
| ఢిల్లీ ఎన్‌సీఆర్ | 70% | 16% |
| బెంగళూరు | 67% | 12% |
| హైదరాబాద్ | 63% | 20% |
| ముంబై | 61% | 26% |
| చెన్నై | 52% | 9% |
సర్వే ద్వారా వెల్లడైన అత్యంత కీలక అంశం ఏంటంటే, హైదరాబాద్‌లో మారటోరియంను తీసుకున్నవారిలో ఎక్కువ మంది కస్టమర్లు, ఆదాయం అలాగే తిరిగి చెల్లింపు (రీపేమెంట్) సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం లేని వారే కావడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న వారిలో 23% మంది, తాము ఏప్రిల్-ఆగస్ట్ సమయంలో ఏదో ఒక సందర్భంలో మారటోరియంను వినియోగించుకున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సమయంలో తమ ఆదాయాల్లో ఏవిధమైన ప్రతికూల ప్రభావాన్ని చవిచూడలేదని కూడా వెల్లడించారు.
మారటోరియం తీసుకున్న వేతనాలు పొందే కస్టమర్ల విషయానికొస్తే, మూడో వంతు (34%) మందికి పైగా తమ వేతనాల్లో ఎలాంటి ప్రభావాన్ని చవిచూడలేదు. భవిష్యత్తులో తమ ఉద్యోగాలను కోల్పోతామన్న భయం/వేతనాల్లో భారీగా కోతలు ఉండొచ్చన్న ఆందోళనలు లేదంటే కొంత మంది విషయంలో తాము భరించాల్సివచ్చే వడ్డీకి సంబంధించి ఎటువంటి అవగాహన లేకపోవడం సైతం దీని వెనకున్న ప్రధాన కారణం అయి ఉండొచ్చు.



