కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి దడపుట్టిస్తోంది. ఇక కుర్రాళ్లయితే అబ్బే. మాకేం కాదనే భరోసాగా ఉన్నారు. ఇమ్యూనిటీ పవర్‌తో తేలికగా ఎదిరిద్దామనే మనో నిబ్బరంగా ఉన్నారు. అమెరికాలో అయితే పాజిటివ్ అనగానే పార్టీ చేసుకుంటున్న పిల్లగ్యాంగ్‌లున్నాయి. అంతటి ధైర్యం ఉండాల్సిందే. కానీ.. అక్కడే 30-40శాతం యువత కరోనా భారీన పడి మరణానికి చేరువవుతున్నారు. ఇది గాలివార్త కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక. అగస్టు నెలలో వైరస్ మరింత విశ్వరూపం చూపబోతుందనే ఆందోళన నెలకొన్న సమయంలో యువతీ, యువకులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ ఓ) చేసిన సూచన ఇది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కుర్రాళ్లు ఎంచక్కా టూరిజం ప్యాకేజీలు వెతుక్కుంటున్నారట. కానీ డబ్ల్యూ హెచ్ ఓ మాత్రం ఇప్పుడు పర్యటనలు, సరదాలు వద్దంటూ వారిస్తుంది. కరోనా వైరస్ సోకిన మొదటివారం.. నెమ్మదిగా అంతర్గత అవయవాలపై దాడి చేస్తుంది. ఆ సమయంలో సరైన చికిత్స తీసుకోకుండా రెండోవారం గుండె, ఊపిరితిత్తులపై విరుచుకుపడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. యువతలో బ్రెయిన్‌లో రక్తంగడ్డ కడుతున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయంటున్నారు వైద్య రంగ పరిశోధకులు. కాబట్టి.. 20-35 మధ్య ఉన్న వారంతా బలంగానే ఉంటారు. కానీ.. వారసత్వంగా సంక్రమించే కొన్ని రకాల జబ్బుల వల్ల వైరస్ తీవ్రతకు గురయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి.. కుర్రాళ్లం మాకేం కాదనే అతి విశ్వాసం వద్దు. ఒకవేళ వస్తే ఎలా అని బెంబేలెత్తవద్దంటూ డబ్ల్యూ హెచ్ ఓ పలు సూచనలు చేసింది. బయటకు వెళ్లినపుడు ముఖానికి మాస్క్, కనీసం 2 మీటర్ల దూరం, చేతులు వీలైనన్ని సార్లు సబ్బుతో కడుక్కోవటం వంటివి చేస్తే చాలంటున్నారు.