కేసీఆర్ ఏది మాట్లాడినా గిట్లనే ఉంటది. కుండబద్దలు కొట్టినట్టుగానే అనిపిస్తది. తెలంగాణ వెనుకబాటుకు ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన పొరపాట్లు కారణమనేది చారిత్రక సత్యం. ఇందుకు ప్రజల తప్పు ఏమీలేకపోయినా పాలకుల తీరుతో తరచూ ఆంధ్రోళ్లు మాటపడాల్సిన దుస్థితి. ఈ విషయాన్ని పలుమార్లు కేసీఆర్ తెరమీదకు తెచ్చారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు మూడింటి సాధనే లక్ష్యం తెలంగాణ ఉద్యమం చేపట్టారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయం సాధించారు. విభజన జరిగిన ఏడాది.. ఇద్దరు చంద్రులు పీఠం ఎక్కారు. ఇద్దరి రాజకీయవైరం.. ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవాలనేంత వరకూ చేరింది. ఫలితంగా ఐదేళ్లు నిప్పు.. ఉప్పులుగా మెలిగారు. బాబును ఏసీబీ కేసులో ఇరికించేంత వరకూ చేరింది. 2019లో జగన్ గెలుపుతో కేసీఆర్ సంబరపడిపోయారు. ఇద్దరం కలసి రెండు తెలుగు రాష్ట్రాలను ప్రగతి వైపు నడిపిస్తామన్నారు. ఇంతలోనే సాగునీటి ప్రాజెక్టుల రచ్చ ఇద్దరి మధ్య దూరం పెంచుతూ.. ఇప్పుడు రచ్చకు దారితీసేంత వరకూ చేరింది. అపెక్స్ కౌన్సెల్‌లో ఏపీ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పై అభ్యంతరం చెప్పింది. దీనివల్ల రాయలసీమ ప్రాజెక్టుకు సరిపడినంత నీరు రాదనే వాదన వినిపించింది. దీనికి కేంద్రం కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టు రూ.45 వేల కోట్లలో పూర్తి కావాల్సింది.. 85 వేల కోట్లకు తెచ్చారంటూ దుయ్యబట్టారు.
ఇదంతా ఏపీ, కేంద్రం కలసి ఆడుతున్న డ్రామాగా భావించిన కేసీఆర్ ఇరు సర్కారులపై మండిపడ్డారు. తాడోపేడో తేల్చుకుందామంటూ సవాల్ విసిరినంత పనిచేశారు. వృధాగా సముద్రంలో కలిసే 2000టీఎంసీ నీటిలో తాము కేవలం 1000 టీఎంసీలు వాడుకోవటం హక్కుగా పేర్కొన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కూడా మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమేనంటూ గుర్తుచేశారు. వాస్తవానికి ఇటువంటి పరిస్థితి ఇరు రాస్ట్రాల మధ్య వస్తుందనేది అధికారులు ఏ నాడో అంచనా వేశారు. ఎప్పుడైతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్ర పోలీసులు తలపడ్డారో అప్పుడే రచ్చ మొదలైంది. అది ఇపుడు తారాస్థాయికి చేరింది. పరిష్కరించాల్సిన కేంద్రంపై కూడా కేసీఆర్ విమర్శలు చేయటంతో.. అపెక్స్ కౌన్సెల్ సమావేశంలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారందన్నమాట. ఏమైనా.. కేసీఆర్ సార్‌కు కోపం వచ్చింది. అది తాటాకు మంటగా ఆరిపోతుందా… తుమ్మ మంటలా ఏపీపై ప్రభావంచూపుతుందా! అనేది కూడా చర్చనీయాంశమే సుమా!