చేతిదాకా వచ్చింది.. నోటిదాకా వచ్చేందుకు అదృష్టం ఉండాలనేందుకు ఇదో ఉదాహరణ. ఒకసారి ఎమ్మెల్యేగా ఓడాడు. మరోసారి ఛాన్సిస్తే పక్కగా గెలిచేవాడు. కానీ ఎక్కడో లక్ తిరగబడినట్టుంది. అంతే.. మాజీగానే మిగిలారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా! ఇంకెవరండీ.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త మర్రి రాజశేఖర్ ముచ్చట. నిజానికి 2019లో మర్రికే ఎమ్మెల్యే టికెట్ దక్కాల్సి ఉంది. కానీ.. ఇంతలో సామాజిక సమీకరణలతో విడదల రజనీ తెరమీదకు వచ్చింది. అంతే ఒక్కసారిగా మర్రి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. ఏం చేస్తాం.. అధినేత ఆదేశాలు.. కోపాన్ని దిగమింగి.. రజనీ గెలుపు కోసం బాగానే ప్రచారం చేశారట. కమ్మ సామాజికవర్గం నుంచి వచ్చిన ఆయన వర్గీయులు మాత్రం దీన్ని అవమానంగానే భావించారు. కానీ అక్కడే వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి కొత్త పాచిక విసిరారు. రజనీ గెలిస్తే.. మర్రిని మంత్రిని చేస్తానంటూ హామీనిచ్చారు. అనుకున్నట్టుగానే ఇటీవల రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కావటంతో ఒకటి మర్రికే నంటూ చెప్పారు. దాదాపు ఆయన కూడా ఎమ్మెల్సీ. ఆ తరువాత మంత్రి అని ధీమాగా ఉన్నారు. కానీ.. ఇంతలో వైసీపీ సీనియర్ నేత.. మచ్చలేని రాజకీయవేత్త పెన్మత్స సాంబశివరాజు మరణించారు. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్రకు వెళ్లినపుడు.. ఆయన వెంట ఉండి నడిపించిన నాయకుడు సాంబశివరాజు. కానీ.. వృద్ధాప్యం వల్లనో.. లేకపోతే.. పెద్దాయనకు ఎందుకీ రాజకీయాలు అనుకున్నారో కానీ.. అధికార పార్టీ ఆ తరువాత ఆయన వైపు కన్నెత్తి చూడలేదట. దీంతో ఇటీవల ఆయన మరణించాక.. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కొడుకు డాక్టర్ పెన్మత్స సురేష్‌బాబు అలియాస్ డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణరాజుకు వెంటనే.. ఎమ్మెల్సీ పదవి ప్రకటించారు. అది కూడా.. మర్రికి ఝలక్ ఇచ్చినట్టుగా ఆయన వర్గం భావిస్తోంది. కానీ.. జగన్ మాట ప్రకారం ఈ సారి ఏదోవిధంగా మర్రి రాజశేఖర్‌ను మంత్రి చేస్తారనేది వైసీపీ శ్రేణుల ధీమా. ఇదంతా.. తాజా ఎమ్మెల్యే రజనీ వల్లనేనంటూ పార్టీలోని మరో వర్గం కారాలు మిరియాలు నూరుతున్నారట. పైగా.. తనకు దక్కాల్సిన మంత్రిపీఠం.. మర్రికి ఎగరేసుకుపోతే తన రాజకీయ ఎదుగులకు ప్రమాదం అనేది రజనీ భయమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారట.