పెళ్లి.. పిల్లలు సంసారం.. ఆ పై కాస్త లావయ్యారంటూ ఎవరైనా అంటే.. వయసు మీదపడుతుంది కదా! అంటూ సాధారణంగా గృహిణుల నుంచి వచ్చే సమాధానం. కానీ.. ఈమె మాత్రం అలా కాదు.. సాధనతో ఏదైనా సాధ్యమేనంటూ నిరూపించారు. 45 ఏళ్ల వయసులో సిక్స్‌ప్యాక్ సాధించి ఔరా.. అనిపించారు.
ఆమె ప్రయత్నం అద్భుతం. కఠోరసాదన ఎంతోమందికి స్పూర్తి. తాను ఎంచుకున్న మార్గం.. అనితరసాధ్యం. కానీ ప్రయత్నిస్తే సాదించలేనిది ఏమీలేదంటూ ఇచ్చిన ఆమె జీవితమే ఒక సందేశం. ఆ స్పూర్తివంతమైన నారీమణి పేరు కిరణ్‌డాంబ్లే. హైదరాబాద్ నివాసి. భర్త పెద్ద సంస్థలో ఉన్నతహోదాలో ఉన్నారు. కొడుకు, కూతురు.. చక్కటి సంసారం. అక్కడే ఆగితే సాధారణ గృహిణిలా ఉండేది. కానీ.. తాను ఎంచుకున్న దారి కఠినమైనది.. కఠోర శ్రమతో కూడుకున్నది అయినా.. అడుగులు వేశారు.. ఇప్పుడు పరుగులు తీస్తూ తనలాంటి ఎందోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
చక్కటి పాటలు పాడే కిరణ్‌డాంబ్లే గొంతు అందరికీ ఇష్టం. అందరి అమ్మాయిలు మాదిరిగానే పెళ్లయి అత్తవారింటికి చేరింది. ఇద్దరు పిల్లలు.. తెలియకుండానే కాలం గడచిపోయింది. ఒకరోజు తనను తాను చూసుకున్నపుడు.. ఏదో లోపం వెక్కిరించినట్టయింది. అదే తన శరీరం.. బాగా బరువు పెరిగింది. అనారోగ్యం కూడా పలుకరించినట్టయింది. బరువు తగ్గేందుకు యోగ శిక్షణకు వెళ్లింది. అప్పుడు తన వయసు 33 సంవత్సరాలు. అంటే… 2007లో అన్నమాట. అదే సమయంలో పిడుగులాంటి వార్త మెదడులో రక్తం గడ్డకట్టినట్టు వైద్యపరీక్షల్లో గుర్తించారు. వ్యాయామం కోసం ఈత సాధనకు స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లింది. కొద్దిరోజులు నీటిలో దిగేందుకు భయపడుతూ ఉండిపోయింది. అక్కడ స్నేహితులు ఇచ్చిన జిమ్ సూచనతో వ్యాయామ సాధన ప్రారంభించింది. రోజుకు అరగంట నుంచి ఆరు గంటల వరకూ కసరత్తులు చేయటం.. శరీరం సహకరించకపోయినా.. అలసినట్టు అనిపించినా ఆగలేదు.. తన లక్ష్యం ఒక్కటే ఫిట్‌నెస్. ఫిట్‌నెస్ ఎంతగా సాధన చేశారంటే.. 6-7 నెలల పాటు జిమ్ చేస్తూ.. 24 కిలోల బరువు తగ్గారు. అప్పటి వరకూ లావైన శరీరంతో వయసు మీదపడినట్టు కనిపించే కిరణ్‌డాంబ్లే.. నాజూగ్గా మారారు. 2008లో కొత్తగా తన జిమ్ ప్రారంభించారు. జిమ్‌టైనర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రామ్‌చరణ్ సతీమణి కామినేని ఉపాసన, మిల్క్‌బ్యూటీ తమన్నా, అందాల భామ అనుష్కలకు ఫిట్‌నెస్ పాఠాలు నేర్పించి.. వారికి ఆరోగ్యం.. అందాన్ని తెచ్చిపెట్టారు కిరణ్‌డాంబ్లే.అంతటితో ఆగితే.. ఆమె కిరణ్‌డాంబ్లే ఎందుకవుతారు.. 2012లో సిక్స్‌ప్యాక్ సాధించాలనే లక్ష్యంగా ఎంచుకున్నారు. ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు కఠినమైన సాధన చేశారు. కండలు పెంచటం కేవలం మగవాళ్ల సొత్తు మాత్రమే కాదు.. సిక్స్‌ప్యాక్ అంటే.. కుర్రాళ్లకే కాదు… సాధన చేస్తే ఎవరికైనా సాధ్యమేనంటూ నిరూపించారు. 2013లో హంగేరిలో జరిగిన ప్రపంచబాడీబిల్డింగ్ ఛాంపియన్‌లో డైరెక్ట్‌గా ఎంట్రీ దక్కించుకున్న మొదటి మహిళ కిరణ్ కావటం విశేషం. 2019లో అంటే ఆమె 45 వ ఏట అడుగుపెట్టినపుడు సిక్స్‌ప్యాక్ సాధించారు. 8ప్యాక్ కోసం సాధన చేస్తున్నారు.
మూడు పదుల వయసు రాగానే.. బాబోయ్ అంటూ భావించే ఎందరో గృహిణులకు ఆమె జీవితం పాఠం. ఆడ/మగ అంటూ తేడాలేకుండా ప్రతిఒక్కరూ ఫిట్‌నెస్ మీద దృష్టి ఉంచాలంటారు. మితమైన ఆహారం.. వ్యాయామంతో చక్కటి ఆరోగ్యం.. అంతకు మించి ఆనందం ఉంటుందంటారామె. ఈ ఫిట్‌నెస్ ప్రయాణంలో భర్త ఇచ్చిన తోడ్పాటు తనను ముందుకు నడిపించిదంటారు.. వెన్నంటి ఉండే ఇద్దరు పిల్లలు కూడా తనకు ఎంతో ప్రోత్సాహం ఇస్తారంటారు. కుటుంబాన్ని.. అటు భర్తను.. కంటికి రెప్పలా చూసుకునే కిరణ్‌డాంబ్లే.. డీజేలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మంచి ఫొటోగ్రాఫర్, మౌంటనీర్, గొప్ప వక్త.. ఇలా అన్నింటి ఆల్‌రౌండర్‌గా ఉన్న కిరణ్ సూచన ఒక్కటే.. ఫిట్‌గా ఉంటేనే.. జీవితంలో హిట్ అవుతామని..!!