ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం.. నిలువెల్లా హిందుత్వం.. కరడుగట్టిన జాతీయవాదం. ఇవన్నీ బండి సంజయ్‌ను నిలబెట్టాయి. ఇన్నేళ్ల కష్టానికి తగిన గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పట్లో ఆలె నరేంద్ర వంటి నేతలు మాత్రమే.. హైదరాబాద్ వంటి నగరంలో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించారు. ఆ తరువాత ఇన్నేళ్లకు బండి రూపంలో ఒక నాయకుడు వచ్చాడనే భావన కలిగించాడు. అంతేనా.. ప్రత్యర్థులకు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాడు. ఎవరీ సంజయ్ అసలు ఊపిరి సలపనివ్వట్లేదనే భయాన్ని శత్రుశిబిరాల్లో కలిగించాడు. హిందుత్వ నినాదానికి తానే రక్ష అనే భరోసా గా నిలిచాడు. సంజయ్ అంటే వ్యక్తి కాదు.. శక్తి అనేంతగా కొద్దిరోజుల్లోనే సత్తా చాటాడు. హైకమాండ్ తనపై ఉంచిన నమ్మకం వమ్ము కాదని చాటారు.
బల్దియా ఎన్నికల్లో టీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మద్యనే పోటీ అనుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో కమలం నుంచి కూడా కాస్త దూకుడు ఉంటుందనే అంచనాలు ఉండేవి. కానీ.. అకస్మాత్తుగా ప్రచారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ దూకుడుతో రాజకీయ సమీకరణలు మారాయి. అస్సలు పోటీయే కాదని భావించి కాషాయ జెండా ఒక్కసారిగా గులాబీ దళంలో కలకలం రేకెత్తించింది. ఇదంతా బండి సంజయ్ సాధించిన విజయంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ వంటి వాళ్లు కూడా పక్కకు జరగాల్సి వచ్చింది. బీజేపీ అంటే బండి అనేంతగా టీఆర్ ఎస్‌ను చీల్చిచెండాటంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్‌లకు గట్టిగా.. ఘాటుగా కౌంటర్లు ఇచ్చుకుంటూ.. టీఆర్ ఎస్ నుంచి వచ్చే విమర్శలకు కౌంటర్ ఇచ్చుకుంటూ దూకుడుగా ముందుకు సాగారు. పాతబస్తీలో భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద పూజలు జరపటమే కాదు.. తమకు ఏకైక ప్రత్యర్థి ఎంఐఎం అంటూ తేల్చిచెప్పారు.
పాతబస్తీలో ఎంఐఎం అక్రమాలు, పన్నులు చెల్లించకుండా ఉండటం, వరదల వెనుక కారణాలు, వీటిని మించిన అసలు సిసలైన అస్త్రం రోహింగ్యాలను ప్రచారంలో ఆయుధంగా మలచుకున్నారు సంజయ్. రోహింగ్యాలను కాపాడుతున్న పార్టీలుగా ప్రత్యర్థులను గురిచూసి కొట్టాడు. 6000 మంది రోహింగ్యాలు హైదరాబాద్‌లో ఉన్నారంటూ పోలీసు గణాంకాలను చూపారు. వారితో పాటు అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయులను సర్జికల్ స్ట్రయిక్ ద్వారా బయటకు పంపుతామంటూ సవాల్ విసిరాడు.
దీంతో టీఆర్ ఎస్, ఎంఐఎం రెండూ బీజేపీ ట్రాప్‌లో పడేలా చేశాడు. ఎంఐఎం మాటలు పరిధులు దాటాయి. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాదులు కూల్చుతామంటూ నోరుజారారు. కేసీఆర్ పాలనపై సుతిమెత్తగా విమర్శలు చేస్తూనే స్వరం పెంచుతూ సంజయ్ దూకుడు పెంచటంతో కార్యకర్తల్లోనూ జోష్ మొదలైంది. వీటిని మించి.. బీజేపీకు ఒక్క ఛాన్స్ అనే మాట
ఓటర్లను ఆలోచించుకునేలా చేసింది. హిందుత్వ నినాదం కూడా జనాల్లోకి చేరింది. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ వంటి నేతలు వాడలేని బాష.. చేయని సవాళ్లను సంజయ్ కేవలం పది రోజుల వ్యవధిలో టీఆర్ ఎస్పై ప్రయోగించాడు. స్టార్ క్యాంపెయినర్లలో ఒకరుగా మిగిలాడు.. బీజేపీ శ్రేణుల్లో హీరోగా నిలిచాడు. జీహెచ్ ఎంసీలో బీజేపీ సాధించబోయే గెలుపు.. నెగ్గే సీట్ల వెనుక సంజయ్ కష్టమే
ఉందనేది పార్టీ వర్గాలు కూడా బలంగా నమ్ముతున్న వాస్తవం.