తీవ్ర అనారోగ్యానికి గురైన కోవిడ్ రోగుల ప్రాణాలను డెక్సామెథాసోన్ రక్షిస్తుందని ఇటీవల మీడియాలోనూ మరియు సామాజిక మాధ్యమాలలోనూ విపరీతమైన ప్రచారం జరుగుతున్నది. కోవిడ్ తీవ్రంగా ఉన్న కేసులకు తక్కువ ధరతో లభించే మందులు సహాయపడతాయంటే నిజంగా అంతకంటే గొప్ప వార్త ఏముంటుంది. కానీ తేలికపాటి లక్షణాలు ఉన్న, లక్షణాలే కనిపించని లేదా సందేహాస్పదమైన కోవిడ్ కేసులలో డెక్సామెథాసోన్ లేదా ఏదైనా కార్టికోస్టెరాయిడ్‌లు కోవిడ్ వ్యాధిని నివారిస్తాయని ఈ రోజు వరకు నిరూపితమైనటువంటి ఒక్క అధారం లభ్యం కాలేదు.
డెక్సామెథాసోన్ అనేది కార్టికోస్టెరాయిడ్స్ హార్మోన్లుగా పిలువబడే మందుల సమూహానికి చెందినది. ఉబ్బసం (ఆస్తమా), అలర్జీలు, చర్మ సమస్యలు, కొన్ని ఆర్ధరైటిస్‌లు మరియు ఇంకా ఇతర నొప్పికలిగిన పరిస్థితులకు సంబంధించిన వ్యాధులకు దీనిని సాధారణంగా ఉపయోగిస్తుంటారు. కార్టికోస్టెరాయిడ్ లోపంకు మరియు సెప్సిస్ వంటి కొన్ని పరిస్థితుల చికిత్సలకు కూడా దీనిని ఉపయోగిస్తారు.
కార్టికోస్టెరాయిడ్స్ ప్రాణాలను రక్షించగవని అర్హత ఉన్న వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగించినప్పుడు మాత్రమే అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడగలవని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి చాలా దుష్ప్రభావాలను కలిగిస్తాయి మరియు వైద్య పర్యవేక్షణలో మాత్రమే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.
కార్టికోస్టెరాయిడ్లు దశాబ్దాలుగా మోసపూరితమైనవిగా నిందవేయబడినవి మరియు ఇది అందరికీ తెలిసిన విషయమే. డెక్సామెథాసోన్ మరియు ఇతర కార్టికోస్టెరాయిడ్స్‌కు చెందిన ప్రిడ్నిసోలోన్ మరియు మిథైలిప్రిడ్నిసోలోన్ యొక్క దుష్ప్రభావాలు ఏవంటే శరీర బరువు పెరగడం, నీరు పట్టడం, తేలికగా కమిలిన గాయాలు, బ్లడ్ గ్లూకోజ్ పెరుగుదల, గాయాలు నెమ్మదిగా మానడం మరియు వివిధ ఇన్‌ఫెక్షన్లు సంక్రమించే ప్రమాదం, అధిక రక్తపోటు, ఎముకలు పెళుసుబారడం మరియు విరగడం, కండరాల బలహీనత, గ్లకోమా, కాటరాక్ట్‌లు, కడుపులో అల్సర్లు, ఆకస్మత్తుగా మూడ్ మారిపోవడం, సైకోసిస్, స్టెరాయిడ్లపై ఆధారపడడం, మరియు పర్యవేక్షణ లేకుండా సుదీర్గకాంపాటు వాడుతూ ఆకస్మత్తుగా వాడడం మానివేస్తే మరణానికి దారితీయడం వంటివి సంభవిస్తాయి.
అందువలన, డెక్సామెథాసోన్ లేదా మరే ఇతర కార్టికోస్టెరాయిడ్‌లను సొంతంగా వాడకుండా ఉండడం మంచింది!
డా॥ రవి శంకర్ ఇరుకులపాటి
సీనియర్ ఎండోక్రినాలాజిస్ట్,
అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్