సమరసింహారెడ్డిలో వీరరాఘవరెడ్డిగా ఆ నటన అదుర్స్.. కృష్ణ సినిమాలో నవ్వులు పండించిన నటుడు. వందలాది తెలుగు సినిమాల్లో నటించిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(74) మంగళవారం కన్నుమూశారు. కొద్దికాలంగా గుంటూరు విద్యానగర్‌లో ఉంటున్న ఆయన ఉదయం బాత్రూమ్‌లో కిందపడిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 1946 అక్టోబరు 10న కర్నూలుజిల్లా ఆళ్లగడ్డలో జన్మించారు. అధ్యాపకుడుగా జీవితాన్ని ప్రారంభించిన జయప్రకాశ్‌రెడ్డి రంగస్థల నటుడు. ఒకేపాత్రతో ఆయన చేసిన అలెగ్జాండర్ నాటకం ప్రేక్షకుల మెప్పును పొందింది. ఇప్పటికీ తెలుగు నాట రంగస్థల రంగానికి తనదైన సేవ చేస్తూనే ఉన్నారు. నటనపై ఆసక్తితోనే 1988లో తొలిసారి బ్రహ్మపుత్రుడు సినిమాలో నటించారు. ఆ తరువాత చాలా సినిమాలు చేసినా.. 1997లో ప్రేమించుకుందాం రాతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో బాలయ్య సమరసింహారెడ్డిలో విలనిజంతో టాప్ స్థాయికి చేరారు. కేవలం విలన్‌గానే గాకుండా.. సహనటుడుగా.. కామెడీ టైమింగ్‌లనూ ప్రకాశ్‌రెడ్డి అంటే.. వావ్ అనేంతగా ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. ఏందిరా అబ్బీ అంటూ.. రాయలసీమ మాండలికంలో ఆయన పలికిన డైలాగ్‌లు ఇప్పటికీ ఎప్పటికీ జనం మదిలో నిలిచిపోతాయి. సీమ భాషకు ఇంతగా గుర్తింపు వచ్చిందంటే ప్రకాశ్‌రెడ్డి డైలాగ్‌లు కూడా కారణమని అనటంలో కూడా అతిశయోక్తి ఉండదేమో.. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు ట్వీట్టర్ ద్వారా నివాళులర్పించారు.