కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్నీ పరిశోధనల్లో మునిగాయి. భారత్ బయోటెక్ రెండో దఫా క్లినికల్ ట్రయల్స్ చేపట్టనుంది. అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకూ కూడా భారత్‌లో క్లినికల్ ప్రయోగాలకు అనుమతులిచ్చారు. మరి.. వ్యాక్సిన్ వస్తే.. మొదట ఎవరికి ఇవ్వాలి? ఖర్చుతో కూడుకున్న వ్యాక్సిన్ భారత్‌లో ఎంతమందికి ఇవ్వగలరు? ఈ ఖర్చు ఎవరు భరిస్తారనే ఎన్నో సందేహాలపై
అపోలో హాస్పిటల్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్, కన్సల్టెంట్ న్యూరాజిస్ట్ డా॥ సుధీర్ కుమార్ విశ్లేషించారు.
కోవిడ్-19 మహమ్మారికి దారితీస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ది చేయడంలో అనేక దేశాలు పరిశోధనలతో తలమునకలై ఉన్నాయి. వ్యాక్సిన్ ఇప్పటి నుండి కొద్ది నెలలలో అనగా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని సక్రమంగా పంపిణీ చేయడంలో ఎదురయ్యే సమస్యలను ముందస్తుగానే ఒక ప్రణాళికబద్దంగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
పెద్ద ఎత్తున అవసరం : ప్రస్తుతానికి ఎటువంటి చికిత్సా లేనటువంటి కోవిడ్ మహమ్మారి నుండి బయటపడడానికి సమర్దవంతమైన వ్యాక్సిన్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. వ్యాక్సిన్ యొక్క సామర్ద్యాన్ని బట్టి ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు డోసులు అవసరం అవుతాయి. భారతదేశం విషయానికి వస్తే 135 కోట్ల వ్యాక్సిన్ యూనిట్లు అవసరం అవుతాయి అదే రెండు డోసులు ఇవ్వవలసి వస్తే ఆ సంఖ్య 270 కోట్లకు పెరుగుతుంది.
భారీ ఎత్తున డబ్బు అవసరం : వ్యాక్సిన్ ఒక యూనిట్ ధర రూ.1000/-లుగా ఉంటుందని అంచనా వేసినట్లయితే మొత్తం 135 కోట్ల యూనిట్లకుగాను 1,35,000 కోట్ల రూపాయలను వెచ్చించాల్సి ఉంటుంది, అదే రెండు డోసులకైతే రూ.2,70,000 కోట్లు ఖర్చు అవుతుంది.
వ్యాక్సిన్‌ను మొదట ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది : వ్యాక్సిన్ వచ్చిన మొదట్లో, వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండవచ్చు, మొదటి రోజు నుండే మనకు అవసరమైన కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్ మోతాదును మనం పొందలేము. కానీ ప్రతి ఒక్కరూ కూడా తమకు వ్యాక్సిన్ కావాలని కోరుకుంటారు. అలాంటి సందర్భంలో వ్యాక్సిన్ బ్లాక్ మార్కెటింగ్‌కు చేరడం, ప్రయివేట్ పార్టీలు వ్యాక్సిన్‌ను అధిక ధరలకు అమ్మడం, ధనవంతులు మరియు సమాజంలో పలుకుబడి కలిగిన వారు మాత్రమే వ్యాక్సిన్‌ను మొదటగా పొందడం వంటి పలు అసంతృప్తికరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. అది శాంతిభద్రత సమస్యగా మారవచ్చు.
అందువలన హైరిస్క్ గ్రూప్‌కే మొదటగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించాలి. హైరిస్క్ గ్రూప్ అనగా 1. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, నర్సులు, పోలీస్ మరియు పారిశుధ్య సిబ్బంది వంటి వారు 2. కోవిడ్-19కు త్వరగా గురయ్యేవారు అనగా మధుమేహం, గుండె జబ్బు, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నటువంటి పెద్ద వయస్సు ఉన్నవారు.
ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తప్పనిసరి : కోవిడ్ మహమ్మారిపై సమగ్ర విజయం సాధించాలనుకుంటే మొత్తం జనాభాకు రోగనిరోధక శక్తిని కల్పించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వ్యాధితో ఒక్క వ్యక్తి మిగిలినా భవిష్యత్తులో అతడి కారణంగా వ్యాధి మరలా మానవ సమాజంలో తిరగబెట్టవచ్చు.
సూచనలు
వ్యాక్సిన్ అభివృద్దిలో పాల్గొన్న ప్రయివేట్ సంస్థలతో ప్రభుత్వం విస్త్రతంగా చర్చలు జరపాలి. సరసమైన ధరకే వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉండేలా వారితో చర్చలు జరపాలి. కేవలం ఒక్క వ్యాక్సిన్ తయారీదారుకే వ్యాక్సిన్ అమ్మకం మరియు పంపిణీని వదిలివేయకూడదు.
వ్యాక్సిన్ లాభ నష్టాలతో సంబంధం లేని ప్రాతిపదికన లేదా కనీస లాభాలతో అమ్మాలి. ఇది భారీ లాభాలను దండుకునే సమయం కాదు. వ్యాక్సిన్ తయారీదారులు దీనిని అర్దం చేసుకుంటారని నేను భావిస్తున్నాను.
వ్యాక్సిన్ ధరను అందరూ భరించగలిగేలా దానికి ఒక సరసమైన ధరను ప్రభుత్వమే నిర్ణయించాలి. ధరను భరించలేనివారికి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ అందేలా చూడాలి.
వ్యాక్సిన్‌ను మొదట ఎవరికి అందించాలి అనేదానికి ఒక ప్రాధాన్యత జాబితాను తయారు చేసుకోవాలి. ధనవంతులు మరియు పలుకుబడి కలిగినవారు లేదా విఐపిలకే వ్యాక్సిన్‌ను అందుకునేలా మొదటి ప్రాధాన్యత ప్రామాణికత అనేది ఉండకూడదు. వ్యాక్సిన్ వచ్చిన తరువాత చివరి క్షణాలలో హడావిడిగా చర్యలు చేపట్టడం కంటే ఇప్పటి నుండే ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యరంగంలోకి దిగాలి. పిపిఇ కిట్లు, ఐసోలేషన్ లేదా ఐసియూ పడకల లభ్యత, అందుబాటులో వెంటిలేటర్ల లేదా వైరస్ పరీక్షా సామర్ద్యాల సంఖ్యపై చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయాలతో ఏర్పడిన గందరగోళాన్ని మనం ఇప్పటికే చూస్తున్నాము.
మహమ్మారి ప్రారంభమైన సమయంలో వీటన్నింటిలో కొరతను చూశాము. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇలాంటి గందరగోళం నివారించాలుని నేను కోరుకుంటున్నాను. కరోనా వైరస్‌కు ప్రపంచవ్యాప్తంగా సమర్దవంతంగా పనిచేసే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మనం తిరిగి సాధారణ స్థితికి చేరుకోగగుతాం, అది మెరుగైన ఆరోగ్యంతోపాటు ఆర్దిక శ్రేయస్సుకు కూడా దారితీస్తుంది.