గోపి.. అంటే సహజంగానే గోడమీద పిల్లి అనే నానుడి వాడుకలో ఉంది. అధికారపార్టీ వైపు పక్కచూపులు చూడటం విపక్షాలకు కొత్తేం కాదు. పవర్ లోకి వచ్చిన పార్టీ కూడా ప్రత్యర్థిని బలహీన చేయాలనే చూస్తుంది. 2014లో పవర్‌లోకి రాగానే టీడీపీ చేసిన పని కూడా అదే. వైసీపీ ఎమ్మెల్యేలకు గాలమేసి 22 మందిని పసుపు గూటికి లాగేసింది. దీనిపై జగన్ కూడా.. ఛీ చెత్త రాజకీయాలు. నీతివంతమైన రాజకీయం నేను చేస్తా చూడమంటూ అప్పట్లో అనవసరంగా నోరుజారారు. ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి వంతు.. ఎలాగూ. చంద్రబాబుకు వయసు మీధపడుతోంది. లోకేష్‌బాబు నాయకత్వంపై జగన్‌కు గట్టి నమ్మకం. అందుకే టీడీపీ మునిగిపోయే నావగానే పార్టీ నేతలు కూడా చూస్తున్నారు. భవిష్యత్‌లో టీడీపీ అధికారం చేపట్టే అవకాశాలు కనుచూపు మేరలో ఉన్నట్టుగా కూడా అంచనా వేయలేకపోతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం.. ఎమ్మెల్యేగా ఉన్నపుడు.. జమాఖర్చులు లెక్కలు సరిచేసుకుందామనే ధోరణిలో టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది గోపీలుగా మారుతున్నారు.
శకునం చెప్పే బల్లి కుడితితొట్టెలో పడినట్టుగా ఉందట అధినేత పరిస్థితి. 2019లో అధికారం మాదేనంటూ జబ్బలు చరచుకున్న తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి నుంచి ఇప్పటికీ కోలుకోలేదు. మీడియా ఎంత పైకి లేపాలని చూసినా ఫలితం మారట్లేదు. పోనీ ప్రతిపక్షంగా అయినా కాస్తో కూస్తో జనం పక్షాన ఉంటారా! అంటే అబ్బే అదీ కనుచూపుమేరలో కనిపించిన దాఖలాల్లేవు. జూమ్ బరాబర్ జూమ్ అంటూ.. యాప్‌లో వీడియో సమావేశాలతో హైటెక్ సీఎంగా చంద్రబాబు పెత్తనం చూసి ఏపీ జనం పగలబడి నవ్వుకుంటున్నారంటూ వైసీపీతో ఎద్దేవా చేయించుకుంటున్నారు. పోనీ.. ఉన్న నాయకులను కాపాడుకుంటున్నారా అంటే అబ్బే అదీలేదాయె. టీడీపీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలు మద్దాలగిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం.. ఇప్పుడేమో వాడపల్ల గణేశ్ ఇలా నలుగురు ఛీ చంద్రబాబుతో మాకేటీ పనంటూ.. జగన్‌కు జై కొట్టారు. అలాగనీ.. వైసీపీ కండువా కప్పుకోలేదు. సైకిల్ దిగనూలేదు. ఏదో ఫ్యాన్‌గాలి కింద కాసేపు ఉందామని వచ్చామంటూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం జగన్‌తో చేతులు కలిపామంటూ లాజిక్ మాటలు. ఇవన్నీ బాబుకు తెలియనవి ఏం కాదు. అయితే.. ఇప్పటికే మరో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి వలసబోతారంటూ కథనాలు వస్తున్నాయి. గంటా కూడా మాంచి ఊపుమీదున్నా.. అవంతి ముకుతాడు వేయటంతో మిడిల్ డ్రాప్ కావాల్సి వచ్చింది.
మరి కళ్లెదుట ఇంత జరుగుతున్నా చంద్రబాబు చాణక్యం ఏమైందనే సందేహాలు కూడా లేకపోలేదు. కానీ.. ఏం చేస్తాడు. కాలం కలసి రానపుడు మాస్క్ వేసుకోవాలనే నిబంధనకు కట్టుడ్డారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఎమ్మెల్యేలను బెదిరించో.. బుజ్జగించో తమ వైపునకు తిప్పుకున్నారనే అపవాదు ఉండనే ఉంది. ఇప్పుడు టీడీపీ విమర్శలు మొదలుపెడితే.. వల్లభనేని వంశీ రూపంలో అస్త్రం వైసీపీ దగ్గర రెడీగా ఉంది. కొడాలి నాని కూడా బాబు అంటే ఒంటికాలిపై లేచేందుకు సిద్ధంగా ఉంటారాయె. కాబట్టి.. అనువుగాని చోట అధికుల మనరాదనే పద్యం కంఠస్థం చేస్తూ.. పెదబాబు, చినబాబు అదను కోసం వేచిచూస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం.