గుంటూరు జిల్లా పెదకూరపాడు అనగానే గుర్తొచ్చే పేరు కన్నా లక్ష్మినారాయణ. వరుస విజయాలతో దూసుకెళ్లిన నేత. క్రమంగా అక్కడ టీడీపీ పాగా వేసింది. దీంతో కన్నా గుంటూరులో సెటిల్ అయ్యారు. కన్నా ఎమ్మెల్యేగా ఉన్నపుడు ప్రధాన అనుచరుడు అన్నీ తానై నడిపించేవాడనే గుసగుసలూ వినిపించేవి. కాపు, రెడ్డి, కమ్మ, మైనార్టీ వర్గాల ఓట్లు న్న కీలక నియోజకవర్గం. వైసీపీ తరపున దాదాపు ఏడెళ్లు.. సమన్వయకర్తగా ఉన్న కావటి మనోహర్‌నాయుడుకు చివర్లో పార్టీ షాక్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నంబూరి శంకర్రావును తెరమీదకు తెచ్చింది. దీంతో అప్పటి వరకూ పునాది వేసుకున్న మనోహర్‌నాయుడు పక్కకు జరిగారు. అంత వరకూ బాగానే ఉంది.. వైసీపీ గాలిలో నంబూరి గెలిచారు. పేరుకే ఎమ్మెల్యే ఆయన అయినా.. షాడో నేత కనుసన్నల్లోనే వ్యవహారం సాగుతుందనే ఆరోపణలు పెల్లుబుకాయి. ఎక్కడ ఏ సెటిల్‌మెంట్ జరగాలన్నా.. నాలుగు మండలాల్లో ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలన్నా షాడో చెబితే ఓకే అనేంతగా చక్రం తిప్పుతున్నాడు. నంబూరి శంకర్రావు నియోజకవర్గ కేంద్రంలో ఉండకపోవటం.. గుంటూరు, హైదరాబాద్‌లో అధిక సమయం ఉండటంతో పూర్తిగా సారథ్యంలోనే పార్టీ, అధికార యంత్రాంగం పనిచేస్తున్నాయట. ఇంతకీ షాడో ఎవరంటే. తెలుగుదేశం పార్టీలో కీలక నేత. టీడీపీ పార్టీ తరపున ఓ ఎన్నికలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలతో కేసు నమోదు చేశారు. ఆ తరువాత రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. కానీ ఆ తరువాత తెలుగుదేశం పార్టీకు దూరమైన షాడో నెమ్మదిగా వైసీపీ గూటికి చేరాడు . నంబూరి శంకర్రావు ఎమ్మెల్యే అయ్యాక. అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. కొద్ది నెలల క్రితమే తనపై ఉన్న రౌడీషీట్ కూడా తీసివేయించుకున్నాట. ఇవన్నీ సాధారణమే అనుకోవచ్చు. కానీ.. అసలు చిక్కు ఏమిటంటే .. ఏళ్లతరబడి జగన్ నామ స్మరణ చేసి. వైసీపీ జెండా మోసిన అసలు కార్యకర్తలను పక్కనబెట్టి.. పూర్తిగా టీడీపీ కార్యకర్తలను వెంటేసుకుని తిరగటమే పార్టీలో కలకలం సృష్టిస్తుందట. మరి దీనిపై నంబూరు ఏమంటారనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవల పలు మీడియాల్లో వరసగా కథనాలు రావటంతో పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. పెదకూరపాడు, బెల్లంకొండ, అచ్చంపేట, కోసూరు మండలాల్లో షాడో నేతలు రాజ్యమేలుతున్నారనే ఆరోపణలున్నాయి. వీరి దందాలతో ఇబ్బందిపడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది. సంక్షేమపథకాలు, కార్యకర్తల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ గతంలోనే సీఎం జగన్ మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులను హెచ్చరించారు. అయినా పద్దతి మార్చుకోని వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారని వినికిడి.