ముక్కుపై కోపం.. మరింత నిజాయతీ.. నిర్మోహమాటం.. ఏదైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడే తత్వం. మిర్చి ఘాటుగా కనిపించే కుర్రాడు అంబటి రాయుడు. సెప్టెంబరు 23 అంబటి పుట్టినరోజు. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్‌ను తొలి మ్యాచ్ గెలిపించాడు.. అబ్బే.. అంబటిలో ఫిట్ నెస్ లేదంటూ పెదవి విరిచిన క్రికెట్ పెద్దలకు 48 బంతుల్లో 70 పరుగులు చేసి నోరు మూయించాడు. వాటిలో 3 సిక్సర్లు, 6 ఫోర్లు కూడా ఉన్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న అంబటి తరచూ వివాదాలకే కేరాఫ్ కూడా మారుతుంటాడు. ఓపిక పట్టాల్సిన చోట సంయమనం కోల్పోవటం కూడా అతడి కెరీర్‌ను దెబ్బతీశాయంటారు క్రికెట్ పండితులు. కానీ.. అంబటి వంటి ఆటగాడు.. మొన్నటి ప్రపంచకప్ క్రికెట్‌కు దూరం కావటం నిజంగానే కప్‌ను ఇండియా కు దూరం చేసిందంటారు. ఏపీలో కులాల కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు కూడా అంబటిని అడ్డుకుందనే ఆవేదన కూడా అంబటి అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. త్రీడైమన్షన్‌లో ఆడే క్రీడాకారుడంటూ తెరమీదకు తెచ్చిన ఆటగాడు.. ప్రపంచకప్ పోటీల్లో పేలవంగా ఆడాడు. అంబటి ఉంటే.. బావుండేదంటూ.. ఇప్పటికీ క్రికెటర్లు చాలామంది గుర్తు చేస్తుంటారు.
గుంటూరు గడ్డపై 23 సెప్టెంబరు 1985లో పుట్టిన అంబటి తిరుపతి రాయుడు. తల్లి విజయలక్ష్మి. సోదరుడు రోహన్, తండ్రి సాంబశివరావు ప్రోత్సహంతో క్రికెట్ వైపు వచ్చాడు. 1992 అకాడమీలో శిక్షణ కోసం తండ్రి రోజూ స్కూటర్‌పై తీసుకెళ్లేవారంటూ అంబటి గుర్తు చేసుకుంటారు. ఇంతింతై ఎదిగినట్టుగా.. అండర్ 15 నుంచి రంజీల వరకూ కేవలం తన ఆటతీరుతో ఎదిగాడు. పైరవీలు.. లాలూచీలు లేకుండానే కేవలం అంబటి ఆడితే మ్యాచ్ గెలుస్తామనే నమ్మకంతో సెలెక్టర్లు ఎంపిక చేసేవారు. అంబటి సత్తా తెలిసిన సహచరులు కూడా ప్రోత్సహించేవారు. కానీ.. క్రికెట్ అంటేనే రాజకీయాలకు చిరునామా. అక్కడ ఎవరు ఎదుగుతున్నా కిందకు లాగేందుకు ఒక బ్యాచ్ ఉంటుందనేది అంబటి విషయంలో రుజువు అవుతూనే ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో ఎంతో సత్తా చాటినా అంతర్జాతీయ క్రీడలో మాత్రం రాణించలేకపోయాడు.

కానీ.. అంబటి గురించి మరో విషయం.. ఖాళీ దొరికితే.. ఎంచక్కా తన ఫామ్‌హౌస్‌లోకి చేరతాడు. సాధారణ రైతుగా మారి.. పంటలు పండించే రైతు అవతారమెత్తుతాడు. ఎవరితో పనిలేకుండా తన వరకూ తాను జీవించటాన్ని ఆస్వాదిస్తాడు. కోపం వెనుక నిజాయతీ.. ఆవేశం వెనుక.. అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం రాయుడు సొంతం అంటారు ఆయన అభిమానులు. పుట్టినరోజు వేళ.. సహచర క్రికెటర్లు.. శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఇటీవల అంబటిరాయుడు, విద్య దంపతులకు చక్కటి బాబు పుట్టాడు. విరాట్‌కోహ్లీ, ధోనీలకు మంచి మిత్రుడు.. ఆ ఇద్దరూ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అంబటి ఇంట బస చేస్తారు. ఎంచక్కా.. బిర్యానీ ఆరగించి కానీ వెళ్లరట. ఎంతైనా గుంటూరు కుర్రాడు కాబట్టి.. ఆ మాత్రం ఘాటు ఉంటుందంటూ ఫ్రెండ్స్ సరదాగా ఆటపటిస్తుంటారట.



