రాయలసీమ.. రాగిముద్ద ఎంతో రుచి. ఏందబ్బీ ఎట్టున్నావంటూ ఆత్మీయమైన పిలుపు మరింత రుచికరం. ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా వర్గపోరు ఫ్యాక్షనిజంగా మారి ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. తెలుగు సినిమా కథలుగా కాసుల వర్షం కురిపిస్తుంది. కడప బాంబులు.. కర్నూలు పగలు.. అనంతపురం ప్రతీకారదాడులు.. ఇలా సీమ జిల్లాల్లో ఇప్పటికీ అదేతంతు. అదే కోవలో అనంతపురంలో పరిటాల కుటుంబం.. జేసీ దివాకర్‌రెడ్డి అలియాస్ జూటూరు చిన దివాకర్‌రెడ్డి. 75 ఏళ్ల దివాకర్‌రెడ్డి 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకముందు మైనింగ్ వ్యాపారిగా అనంతపురంలో చక్రం తిప్పారు. అదే సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి కూడా మైనింగ్ వ్యాపారంలో ఉండే వారు. అయితే.. ఆయన కడప జిల్లా దాటి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ మైనింగ్ లీజులు పెంచుకుంటూ వచ్చారు. దీంతో రాజారెడ్డితో దివాకర్‌రెడ్డి సోదరులకు వైరం మొదలైంది. క్రమంగా ప్రత్యర్థులుగా మారారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా మరో వర్గాన్ని పెంచి పోషించారనే గుసగుసలూ ఉన్నాయి. ఇలా 36 ఏళ్లుగా.. వైఎస్ కుటుంబంతో వైరం కొనసాగుతుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక.. జేసీ దివాకర్‌రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2009లో మాత్రం పదవి దూరమైంది. సీనియర్ నాయకుడు అయినా కేవలం ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వచ్చింది. వైఎస్ మరణించిన తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ మంత్రి పదవి దక్కలేదు. 2014కు ముందు సమైఖ్యాంధ్ర ఉద్యమంలో కీలకంగానే వ్యవహరించారు. రాష్ట్ర విభజన జరిగితే.. రాయల తెలంగాణ కావాలని నినదించారు పట్టిసీమను వ్యతిరేకించారు.. కావాలని స్వాగతించారు. 2014లో టీడీపీలోకి చేరి ఎంపీగా అనంతపురం నుంచి గెలిచారు. కేంద్రంలోని ఎన్డీఏతో పొత్తు ఉండటంతో మంత్రిపదవి వస్తుందనుకున్నా ఝలక్ తప్పలేదు. దీంతో చంద్రబాబును కూడా విమర్శించారు. మైనింగ్, కాంట్రాక్టులతోపాటు.. ట్రావెల్స్ లోనూ కోట్లు పెట్టుబడిగా పెట్టారు. బస్సులు, లారీలను జాతీయస్థాయిలో రవాణా సాధనాలుగా మలచుకున్నారు. ఇదంతా లీగల్ అయితే సమస్యేం కాదు.. కానీ.. ఇదంతా అనైతికంగా.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన కొత్తతరహా దోపిడీ. పన్నులు ఎగ్గొట్టి, నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు నష్టపరిచారు. పైగా ప్రజల ప్రాణాలకు హానికలిగించేలా బస్సులు నడిపారనేది వైసీపీ
ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. 154 బస్సులు, లారీలు నాగాలాండ్ లో రవాణాశాఖ నుంచి ముడిసరుకుగా.. ఎందుకు పనికిరాని ఇనుముగా కొనుగోలు చేసిన లారీ ఛాసిస్లు కావటమే ఇక్కడ నేరం. వాటిని కరిగించి సొమ్ముచేసుకోవాలి. కానీ.. అదే ఛాసిస్‌లకు పర్మిట్లు, ఇన్సూరెన్స్‌లు చేయించి మరీ బస్సులు, లారీలుగా మార్చి జనాల మీదకు వదిలేశారు. ఇలా ఏపీ, తెలంగాణ , కర్ణాటక, తమిళనాడులో వందకు పైగా బస్సులు రోజూ జనాన్ని గమ్యం చేర్చుతున్నాయి. గతంలో ఒక బస్సు కర్ణాటక నుంచి వస్తూ దహనమైంది. పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవంగా కాలిపోయారు.దీనిపై సీఐడీ కేసు కట్టినా దాని తాలూకూ దర్యాప్తు వెబ్సైట్ నుంచి తొలగించారు. ఇదంతా అడ్డదారిలో చేస్తున్న.. కొనసాగిస్తున్న దోపిడీయే. ఇంతకాలానికి వైసీపీ కక్షసాధింపుగానో.. ప్రజల్లో మెప్పుకోసమో.. చట్టాన్నికఠినంగా అమలు చేయాలనే సంకల్పబలమో.. జేసీ బ్రదర్స్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. పాత పద్దులన్నీ వెలికితీసి మరీ అరెస్టులు కొనసాగిస్తున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు ఆశ్రిత్‌రెడ్డి ఇద్దరూ అరెస్టయ్యారు. మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి కూ అదే భయంలో ఉన్నాడు. ఇదంతా తాత, తండ్రి చేయలేకపోయినా.. వారి వారసుడుగా జగన్ మోహన్‌రెడ్డి చేశాడంటూ సీమలో కొందరు సీనియర్ నేతలు అంటున్నారు.