కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మం కంచికి చేరిన‌ట్టేనా???

కాపు.. తెల‌గ‌.. బ‌లిజ .. ఒంట‌రి .. మున్నూరు కాపు ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అధిక‌జ‌నాభా ఉన్న కులం. రాయ‌ల‌సీమ‌లో రెడ్డి కులం కూడా త‌మ కులం పేరు ఉన్న చోట కాపు అనే ఉంటుందంటూ గ‌తంలో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సెల‌విచ్చారు. కాపు అనేది ఒకే కులానికి సంబంధించిన ప‌దం కాదంటారు ప్ర‌వ‌చ‌న సార‌ధి గ‌రిక‌పాటి వారు. ఎవ‌రేమ‌నుకున్నా కాపుల రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మం ఐదేళ్ల‌కోసారి పంథా మార్చుకుంటుంద‌నే అప‌వాదును కాపు వ‌ర్గ నేత‌లు మూట‌గ‌ట్టుకుంటూనే ఉన్నారు. మేం లేస్తే మ‌నిషిని కాద‌న్న‌ట్టుగా.. కొద్దిరోజులు హ‌డావుడి చేసిన నేత‌లు ఆ త‌రువాత సైలెంట్ అవుతున్నారు. న్యాయ‌స్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయంటూ అవి ఏ కోర్టుల్లో ఉన్నాయో తెలియ‌కుండానే పార్టీలు స్పందిస్తుంటాయి. పార్టీల్లో ప‌ద‌వులు ఆశించిన కాపు కుల పేద్ద‌లు కూడా దానికి వంత‌పాడుతుంటారు. రిజ‌ర్వేష‌న్‌లు దూరం కావ‌టం వ‌ల్ల 50 ఏళ్లుగా.. ప్ర‌తి త‌రంలోని ఎంతోమంది విద్యార్థులు చ‌దువుకు, ఉద్యోగాల‌కు దూర‌మ‌వుతున్నార‌నే విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. రాజ‌కీయంగా బీసీ కోటాలో పొందే అవ‌కాశాల‌ను చేతులారా జార‌విడ‌చుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు. అయితే.. సామాజికంగా ఇత‌ర వ‌ర్గాల నుంచి ఎదుర‌య్యే వ్య‌తిరేక‌త‌. ఆ ఓటు బ్యాంకు దూర‌మ‌వుతుంద‌నే భ‌యంతోనే ప్ర‌తి రాజ‌కీయ‌పార్టీ కాపుల‌కు ద‌శాబ్దాలుగా మొండిచేయి చూపుతూనే ఉంటుంది. కాంగ్రెస్ హ‌యాంలో రాజ‌కీయ చ‌క్రం తిప్పి.. మంత్రిప‌ద‌వులు అనుభ‌వించిన కాపు నేత‌ల అప్పుడేం చేశార‌నే కాపు యువ‌త ప్ర‌శ్న‌కు స‌మాధానం క‌నిపించ‌దు.

2014 ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు కాపు ఓట్ల కోసం రిజ‌ర్వేష‌న్ల‌ను మ‌రోసారి తెర‌మీద‌కు తెచ్చారు. రాజ్యాంగం తెలిసిన మూడుసార్లు సీఎం చేసి బాబు మాట‌లు నిజ‌మ‌నే భావించారు. ఆ స‌మ‌యంలో జ‌న‌సేన కూడా టీడీపీతో దోస్తీ చేయ‌టంతో కాపుల ఇంకేముంది బాబు గెల‌వగానే త‌మకు బీసీ హోదా అని చంక‌లు గుద్దుకున్నంత ప‌నిచేశారు. కానీ ఎన్నిక‌ల‌య్యాక‌.. తూచ్ . మీకు రిజ‌ర్వేష‌న్ కాదు.. కార్పోరేష‌న్‌లో కోట్లు కుమ్మ‌రిస్తానంటూ మాట మార్చి.. ఏమార్చారు. ఆ నాడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నారాయ‌ణ‌, బోండా ఉమా, చిన‌రాజ‌ప్ప అండ్ కో బ్యాచ్ కూడా బాబు గారు కాపుల‌పై ద‌య‌చూపారంటూ పాలాభిషేకం చేశారు. కానీ.. కార్పోరేష‌న్‌లోకి కాపుల ముసుగులో దూరిన కొన్ని పందికొక్కులు ఆ సొమ్మునూ స్వాహా చేశాయంటూ అప్ప‌ట్లో మీడియా కోడై కూసింది. 2017లో అనుకుంటా.. న‌రేంద్ర‌మోదీ.. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్ అంటూ మాంచి కిక్ ఇచ్చే ప్ర‌క‌ట‌న చేశారు.

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చే 10శాతం రిజ‌ర్వేష‌న్‌లో కాపుల‌కు 5 శాతం అంటూ 2018లో అనుకుంటాను.. బాబు గారు మ‌హా గోప్ప ప్ర‌క‌ట‌న చేశారు. అప్పుడూ కాపులు పొలికేక పెట్టారు. సంబ‌రాలు చేసుకోవ‌టం మిన‌హా అంత ప‌నిచేశారు. దానిపై కోర్టులు ఎవ‌రెవ‌రికి ఎంత రిజ‌ర్వేష‌న్ ఇవ్వాల‌నేది మీ ఇష్ట‌మేనా! అంటూ మొట్టికాయ‌లు వేయ‌టంతో ఎవ్వ‌రూ నోరుమెద‌ప‌లేక‌పోయారు. ఆ స‌మ‌యంలోనే గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో ఉన్న నాటి విప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కూడా కాపుల బిసీ రిజ‌ర్వేష‌న్ త‌న చేతుల్లోకి కాదంటూ తేల్చిచెప్పారు. ఇరువైపుల స‌మ్మెట‌పోటుతో దిమ్మ‌తిరిగిన కాపుల‌కు దిక్కుతోచ‌క ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పైనే భార‌మేశారు. ఆయ‌న కూడా.. ఆ నాడు బాబుకు లేఖ‌లు రాశారు. ఈ నాడు కూడా జ‌గ‌న్‌కు లేఖ‌లు రాస్తూనే వ‌చ్చారు.

కానీ.. ఇంత‌లో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఏవో కార‌ణాలు చూపుతూ తూచ్‌.. ఉద్య‌మం నుంచి నేను వైదొలుగుతున్నానంటూ తేల్చిచెప్పారు. బాబ్బాబు.. మీరే రావాలంటూ కాపు పెద్ద‌లంతా చేరి ముద్ర‌గ‌డ‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసినా.. సారీ అంటూ చెప్పేశారు. కావాలంటే.. మీ ఇళ్ల‌ల్లో జ‌రిగే పెళ్లిళ్లు.. గృహ‌ప్ర‌వేశాల‌కు వ‌స్తా! అంతేకానీ.. న‌న్నీ ఉద్య‌మంలోకి లాగొద్దంటూ సెల‌విచ్చారు. అప్పుడే రాజ‌కీయ ఉద్దండుడు చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య తెర‌మీద‌కు వ‌చ్చారు. 80 ఏళ్లు దాటిన ఆయ‌న కాపుసంఘం ఏర్పాటు అంటూ హ‌డావుడి చేసి సైలెంట్ అయ్యారు. అటు చంద్ర‌బాబు కూడా.. కాపుల‌ను నెత్తిన పెట్టుకున్న నింద నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆ ఊసే ఎత్త‌టం మానేశారు. జ‌గ‌న్ కూడా.. కాపుల రిజ‌ర్వేష‌న్ త‌న చేతుల్లో లేదంటూ సుర‌క్షితంగా త‌ప్పించుకున్నారు. మ‌రి.. ఇప్పుడు కాపుల‌కు దారేది.. ఉద్య‌మం న‌డిపించే నాయ‌కుడు ఎవ‌రంటే..? చెప్ప‌టం కూడా క‌ష్టంగానే మారింది. బ‌ల‌మైన వ‌ర్గ‌మ‌నే పేరున్నా.. ఐక‌మత్యం లేక‌పోవ‌టం.. కాపు ప్ర‌జాప్ర‌తినిధులు రాజ‌కీయ పార్టీల చేతిలో కీలుబొమ్మ‌గా మారి.. అస్తిత్వం కోల్పోవ‌టం కూడా కాపుల‌కు ద‌శాబ్దాలుగా అన్యాయం జ‌రిగేందుకు కార‌ణమ‌వుతోంది.

Previous articleసాయిప‌ల్ల‌వి చాలా బిజీగురూ!
Next articleఇండో చైనా బోర్డర్ లో టెన్షన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here