పవన్‌కళ్యాణ్.. ఆయనకు తిక్క ఉందహే. అన్నయ్యే ఏం చేయలేకపోయాడు.. ఇతగాడెంత. పావలా కళ్యాణ్ అంటూ ఎద్దేవాచేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ ఆయన వ్యక్తిగత జీవితంలోకి దూరి మాటలు జారారు. అస్సలు పవన్‌ను పట్టించుకోవాల్సిన పనేలేదంటూ.. కారుకూతలు కూసిన వారందరు ఎందుకింత భయపడుతున్నారు. పీఎస్‌పీకే అంటే పసికూన అంటూ రొమ్ములు ఎగురేసిన ఖద్దరు దొరలు ఇప్పుడెందుకు ఆయన చుట్టూ కుట్రలు పన్నుతున్నారంటూ జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు.. అధినేతకు జైజేలు కొట్టి.. పొర్లుదండాలు పెట్టిన నేతలు.. అదే పార్టీ విపక్షంలోకి చేరగానే జెండా మార్చేస్తున్నారు. కాంట్రాక్టులు, కమీషన్లకు ఆశపడో.. జైలు పోతామనే భయంతోనే ఏ పార్టీ పవర్‌లో ఉంటే ఆ జెండా కప్పుకుంటున్నారు. దీనికి నియోజకవర్గ అభివృద్ధి.. మా కార్యకర్తల ఆకాంక్ష అంటూ మాటలతో ఏ మార్చుతున్నారు. కానీ.. పవన్ వెంట నడచిన జనసైనికులు, అభిమానులు మాత్రం తాము పవర్ స్టార్ పక్కనే ఉంటామంటున్నారు. గెలుపోటములకు అతీతంగా పవనే మా నాయకుడు అంటూ గర్వంగా చెబుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు నుంచే పక్కా ప్రణాళికతో ఉండాలనే భావనకు వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనే ఆలోచన చేస్తున్నారట. వరుసగా చేయాల్సి ఉన్న 6 సినిమాలు పూర్తికాగానే జనం బాట పట్టేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జనసేనాని రాజకీయాన్ని కట్టడి చేయాలి. నయానో.. భయానో పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. ఇదే ఇప్పుడు ఆయన ప్రత్యర్థుల ముందున్న అంశాలు. పవన్ చేస్తున్న సినిమాలపై విషప్రచారం చేయటం ద్వారా బాక్సాఫీసు కలెక్షన్లు తగ్గించాలి. తరచూ మూడు పెళ్లిళ్ల ను తెర మీదకు తీసుకువచ్చి మానసికంగా కుంగతీయటం. సోషల్ మీడియాలో అసభ్య, అశ్లీల పదజాలంతో చెలరేగటం. శ్రీరెడ్డి వంటి తారలను మరోసారి జనం ముందుకు ముఖ్యంగా మీడియా ముందుకు తీసుకువచ్చి పవన్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ట్రోల్ చేయటం. రాజకీయంగా జనసేన అంటే… కేవలం కులపరమైన పార్టీగా ప్రచారం చేయటం. బీజేపీతో జతకట్టడం వల్ల హిందువాదిగా ముద్రవేయాలనే ప్రయత్నించటం. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌గా నమ్మించే ప్రయత్నాలు చేయటం. వీటి ద్వారా పవన్‌ను ప్రభుత్వ వ్యతిరేకత ఓటుకు దూరం చేస్తారు. అదే సమయంలో కుల, మతపరమైన ముద్రతో ఓటుబ్యాంకును తాము కొల్లగొట్టాలని మరో పార్టీ అంతరంగం. వెరసి.. పవన్‌కు ప్రతికూలంగా భావించే ప్రతి అంశాన్ని నాలుగేళ్ల పాటు ప్రచారం చేయాలనేది ప్రత్యర్థుల కుట్రలు.
తాజాగా సీపీఐ నారాయణ మరోసారి నోరు జారారు. పవన్‌తో పొత్తు మా ఖర్మ అనేంతగా స్పందించాడు. పైగా పవన్ మూడు పెళ్లిళ్ల అంశం మరోసారి ప్రస్తావించిన నారాయణ తన పెద్దరికం మరచినట్టున్నారు. అనుకూల మీడియాతో పాపులారిటీ సంపాదించిన నారాయణుడి లీలలు గురించి కూడా ఎన్నో ఆరోపణలున్నాయి. భూ మాఫియా అంటూ హల్‌చల్ చేస్తూ.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుంటారనే అభియోగాలు ఆయనగారిపై ఉన్నాయి. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనట. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగానే స్పందించారు. నారాయణ మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఎర్రపార్టీలతో పొత్తు పెట్టుకుని ఏ ఒక్కరూ బాగుపడలేదనే విషయాన్ని గుర్తు చేశారు. మరో వైపు పవన్ కళ్యాణ్‌ను ప్రత్యర్థిగా భావించే గ్రూపులు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టాయి. పవన్ పని అయిపోయినట్టే. పార్టీ కూడా మనుగడ లేదంటూ పిచ్చిరాతలతో సేనానిని దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారంటూ జనసైనికులు ఆందోళన వెలిబుచ్చారు. జనసేన సోషల్ మీడియా గ్రూపు కూడా చాలా యాక్టివ్ గా తయారైంది.. శత్రువుల విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చేందుకు సిద్ధమవుతోంది.