బోరబండ కొద్దిరోజులుగా హాట్‌టాపిక్‌గా మారిందనేది తెలిసిందే. తరచూ అక్కడ భూకంపాలు సంభవించటమే దీనికి కారణం. వారం రోజుల వ్యవధిలో సుమారు 100 సార్లు భూమి కంపించి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉండే నగరం. సముద్రమట్టానికి ఎత్తులో ఉంది. రాతి ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల భూకంపాల ప్రభావం కూడా కనపించదనేది పరిశోధనలు తేల్చిన వాస్తవం. నేషనల్ జియోగ్రఫీ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త నగేష్ బోరబండతో సహా హైదరాబాద్ నగరంలో పరిశోధనలు జరిపిన తరువాత తేల్చిన వాస్తవం. లక్షల ఏళ్ల వయసున్న కొండలు, గుట్టలు, బండరాళ్లు కొన్నిసార్లు దొర్లుతుంటాయి. భూమిలో ఖాళీ ఏర్పడినపుడు సర్దుబాట్లు జరుగుతుంటాయి. దానివల్ల కొద్దిగా భూమి కంపించినట్టుగా అనిపిస్తుంది. అంతే తప్ప ఇది ప్రమాదకరమైనది కాదంటారాయన.
గతేడాది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంయుక్తంగా దేశంలోని పలు నగరాల్లో భూకంపాలపై పరిశోధన చేశారు. అక్కడ దిమ్మతిరిగే విషయాలను గుర్తించారు. భారత్‌లో 50 నగరాలకు భవిష్యత్‌లో భూకంప ముప్పు పొంచి ఉందని నిర్ధారణకు వచ్చారు. ఎర్త్‌క్వాక్ డిజాస్టర్ రిస్క్ నివేదిక 50 నగరాలను మూడు భాగాలుగా విభజించారు. హై, లో, మిడిల్‌గా వీటిని నిర్ధారించారు. విజయవాడ హైరిస్క్ జోన్‌లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే వరదలు, తుపాన్ల వల్ల కోస్తా ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలు తరచూ నష్టాలు చవిచూస్తుంటాయి. దీనికి తోడు భూకంపాలు కూడా జతకట్టడం గుబులు రేకెత్తించే అంశం.
విజయవాడ మాత్రమే కాదు తరువాత స్థానాల్లో చెన్నై, పుణే, ముంబై, అహ్మదాబాద్, చండీఘడ్, డార్జిలింగ్, సిలిగిరి నగరాలున్నాయి. భూకంపాల వల్ల 90శాతం నష్టాలు కేవలం ఇళ్ల నిర్మాణాలు సరిగా లేకపోవటం వల్లనే జరిగాయని అదే పరిశోధనలో గుర్తించారు. 1983 లాతూర్, 1990 చమేలీ, 1997 జబల్‌పూర్, 2001 భుజ్, 2005 కాశ్మీర్, 2016 నేపాల్, 2016 మణిపూర్‌ల్లో భారీ భూకంపాలు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టాలు కలిగించాయి. ప్రకృతిని జయించేందుకు దానికి అనుకూలంగా జీవించటాన్ని అలవాటు చేసుకోవాలంటారు ఆధ్యాత్మిక వేత్తలు. నిర్మాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు శాస్త్రవేత్తలు. ఈ లెక్కన.. బెజవాడలో ఎన్ని బోరబండలు ఉన్నాయనేదానిపై మరోసారి శాస్త్రవేత్తలు దృష్టిసారించాల్సిందేనేమో..!