తెలంగాణాలో ఎన్నికల సందడి దాదాపు మొదలైంది. దుబ్బాక ఉప ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో అభ్యర్థులు దాదాపు ప్రచారం చేపట్టారు. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. గులాబీ, కమలం, హస్తం పార్టీలకు అత్యంత కీలకమైన హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పాత పద్ధతిలో అంటే బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఎన్నికల సంఘం దాదాపు నిర్ణయించింది. తాజాగా తిరుమలలోని వెంకటేశ్వరుని దర్శించుకున్న తెలంగాణ ఎన్నికల అధికారి పార్దసారథి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ చెప్పారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలను డిసెంబరు నెలలో పూర్తి చేసేందుకు సర్వసన్నద్ధతను ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ ఎస్ మూడు ప్రధానపార్టీలు జమలి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ఒకవేళ రెండేళ్ల తరువాత ఎన్నికలు అనివార్యమైతే తాము ఎలా జనాల్లోకి వెళ్లాలనే వ్యూహాలు పన్నుతున్నాయి. అందుకే దీనికి ముందుగానే ప్రజల్లో తమ బలం పెంచుకునేందుకు రాబోయే ఎన్నికలను అనుకూలంగా మలచుకోవాలని ఉబలాటపడుతున్నాయి. వాస్తవానికి జీహెచ్ఎంసీ పాలనకు వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారం వరకూ గడవు ఉంది. దానికంటే ముందుగానే ఎన్నికలు వెళ్లాలని టీఆర్ ఎస్ భావిస్తోంది. దానిలో భాగంగానే పక్కా ప్రణాళికతో కేటీఆర్ ఏడాది ముందు నుంచే హైదరాబాద్ మీద దృష్టి ఉంచారు. సుమారు 60000 కోట్లరూపాయలతో నగరవ్యాప్తంగా ఫ్లైఓవర్లు, రహదారులు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, జేఎన్‌యూఈఆర్ ఎం పూర్తిచేశారు. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను భారీగా పెంచేశారు. ఇదే అదనుగానే ముందస్తుగానే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లటం ద్వారా ఈ సారి 100కు పైగా డివిజన్లలో గెలుపు సాధించాలనే వ్యూహంలో ఉన్నారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 99 సీట్లు సాధించింది. అప్పుడు సెంచరీ కొట్టాలనే కేటీఆర్ కల ఈ సారి ఎంత వరకూ నెరవేర్చుకుంటారో చూడాలి మరీ.
దుబ్బాకలో టీఆర్ ఎస్‌కు భారీ దెబ్బ తగిలింది. రామలింగారెడ్డి భార్య సుజాతను టీఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ రఘునందన్‌రావును నిలిపింది. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా చెరువు శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపింది. టీఆర్ ఎస్ నుంచి సీటు ఆశించిన శ్రీనివాసరెడ్డి హస్తంలోకి చేరటం టీఆర్ ఎస్‌ను దెబ్బతీస్తుందనే వాదన బలంగా వినిపిస్తుంది. కానీ అక్కడ హరీష్‌రావు
అన్నీతానై చక్రం తిప్పుతున్నాడు. టీఆర్ ఎస్‌కు సానుభూతి కలసివస్తుందని.. అంతేగాకుండా రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వం అవసరమనే భావన ప్రజల్లో ఉందనే ధీమా గులాబీగూటిలో ఉంది. బీజేపీ కూడా రఘునందనరావు వరుస ఓటమి ఈ దఫా సానుభూతిగా మారి కమలం పార్టీను గట్టెక్కిస్తుందంటన్నారు. ఏమైనా ఇక్కడ గెలుపు ద్వారా మూడు పార్టీలు భవిష్యత్‌లో తమ వ్యూహాలను మార్చుకునేందుకు రిఫరెండంగా భావించటం కొసమెరుపు. ఒకవేళ ఇక్కడ టీఆర్ ఎస్ గెలుపు గుర్రం ఎక్కితే.. కేసీఆర్ చరిష్మా తగ్గలేదని గులాబీశ్రేణులు అంచనాకు వస్తాయి. బీజేపీ విజయం సాధిస్తే.. నరేంద్రమోదీపై తెలంగాణలో నమ్మకం పెరుగుతుందనే ధీమాకు వస్తారు. కాంగ్రెస్ గెలవగలిగితే.. భవిష్యత్ ప్రధానిగా రాహుల్‌గాంధీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారనే కొత్త నినాదంతో ముందుకు వెళతారు. ఎవరి లెక్కలు వారికే ఉన్నాయి. మరి ప్రజలు కూడా తమ లెక్కలు తమకు ఉంటాయని నిరూపించాల్సి ఉందన్నమాట.
                


