రంగస్థలంలో జిల్ జిల్ జిల్ జిల్ జిగేల్ రాణీ అంటూ అందం.. అద్భుతమైన నృత్యంలో ఆకట్టుకున్న భామ పూజాహెగ్డే. కన్నడసీమకు చెందిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ముంబైలో అవకాశాలు దక్కకపోయినా తెలుగు సినిమాలో మాత్రం ఆమే కాల్షీట్లు కోసం నిర్మాతలు పడిగాపులు కాస్తున్నారు. బుద్దిగా చదువుకునే వయసులోనే అందాలపోటీలకు ఎంపికైంది. మిస్ ఇండియా.. మిస్ యూనివర్స్ రెండూ జస్ట్ మిస్సయ్యాయి. కానీ అదే సమయంలో ఒక లైలాకోసం సినిమాతో తెలుగులో అవకాశాలు తలుపుతట్టాయి. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా తరువాత మెగా హీరో వరుణ్‌తేజ్ ఎంట్రీ సినిమా ముకుందలో ముద్దమందారంగా మెరిసింది. చక్కటి నటనతో వారెవ్వా అచ్చు తెలుగు అమ్మాయిగా ఉందని ప్రేక్షకులను అనుకునేలా చేసింది. మొదట్లో కాస్త తడబడినా ఆ తరువాత సినీఅవకాశాలను అందిపుచ్చుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. దువ్వాడ జగన్నాథం, అరవిందసమేత, రంగస్థలం, గద్దలకొండ గణేశ్ , అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ మూవీలతో దుమ్మురేపింది. వాస్తవానికి 2012లోనే తొలిసారి ముగమూది అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం ప్రభాస్ ప్రతిష్ఠాత్మక సినిమా ఆదిపురుష్‌తో సీత పాత్రలో మెప్పించనుంది. ఇంతకీ పూజా గురించి ఎందుకీ విషయాలు అంటారా.. 1990 అక్టోబరు 13న పుట్టిన పూజహెగ్డేకు ఈ రోజే.. అంటే 13న 29 సంవత్సరాలు నిండాయన్నమాట. అందుకే.. పూజా నటన గురించి సరదాగా ఇలా గుర్తు చేసుకుంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామా!! ఇప్పటికే ఎంతోమంది అభిమానులు.. సినీ నటీనటులు ట్వీట్టర్ ద్వారా బోలెడన్ని విషెస్ చేప్పేశారు.




