మొన్న చెన్నై.. నిన్న ముంబై.. ఇప్పుడు హైదరాబాద్ . వందేళ్ల చరిత్రలో తొలిసారి 32 సెంటీమీటర్ల వర్షం బీభత్సం సృష్టించింది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలోకి నీరు చేరింది. చాంద్రాయణ గుట్ట వద్ద చెరువు తెగింది. బాలాపూర్‌లోకి వరద పోటెత్తుతోంది. హిమాయత్‌సాగర్ నుంచి వస్తున్న నీటితో మూసీ నదికి భారీగా నీరు చేరుతోంది. మంగళవారం అర్ధరాత్రి పాతబస్తీలో కాంపౌండ్ వాల్ కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు మరో 20 మంది వరకూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో గోడకూలి తల్లీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. ఇది కనీవిని చూడని ప్రళయంగానే వాతావరణ శాఖ భావిస్తుంది. హైదరాబాద్‌లో మూసీ నదికి అప్పట్లో వరద వచ్చిందనేవారు ఆ తరువాత 2000 సంవత్సరం అగస్టులో 28 సెంటీమీర్ల భారీ వర్షంతో నగర రహదారులపై తొలిసారి పడవలపై ప్రయాణం చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం పాతబస్తీతోపాటు పలు ప్రాంతాల్లో పడవలతో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. పోలీసు, జీహెచ్ఎంసీ, ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మహమూద్అలీ తదితరులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవసరమైతే సైన్యాన్ని, వైమానిక దళాన్ని రంగంలోకి దింపేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు బయటకు రావద్దంటూ నగర ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ పూర్తిగా మునిగింది. ముందుగానే ముప్పు గురించి చెప్పినా యంత్రాంగం సరిగా చర్యలు చేపట్టలేకపోయింది. జలప్రళయం రాబోతుందనే సమాచారం ఉన్నా అదికారులు మొద్దునిద్రతో జరగరాని నష్టం జరిగింది. ఆరాంఘర్ ప్రాంతంలో వరద ఉదృతికి వాహనాలు కొట్టుకుపోయాయి.
అప్పాచెరువు తెగటం వల్ల వచ్చిన వరదనీటితో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే ముగ్గురు మరణించినట్టు గుర్తించారు. ఆ వాహనాల్లో ఇంకా ఎంతమంది ఉంటారనే ఆందోళన వ్యక్తమవుతుంది. నదులుగా తలపించేలా రహదారులు మారాయి.
ఈ విపత్కర పరిస్థితిలో సహాయం కోసం హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ 040-21111111, 90001 13667, 97046 01866, చెట్లు పడిపోతే 66090 62583, పవర్ ప్రాబ్లమ్ 94408 13570, ఎన్‌డీఆర్ ఎఫ్ సేవలకు 040- 29555500, 83330 68536



