నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదీ.. తాజాగా నటసింహం బాలకృష్ణ ట్వీట్టర్ ద్వారా పంచుకున్న అనుభవం. ఇప్పుడెందుకీ ప్రస్తావన అంటే.. బాలయ్య ఆగిన నర్తనశాలలో తీసిన కొన్ని సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాలయ్య పౌరాణిక పాత్రల్లో తండ్రి ఎన్టీఆర్‌కు తగిన తనయుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రితో కలసి పలు సినిమాల్లో నటించిన బాలయ్య వీరబ్రహ్మేంద్రచరిత్రలో సిద్ధుడుగా అద్భుత నటన ప్రదర్శించాడు. ఆదిత్య 369లో కృష్ణదేవరాయలు, భైరవద్వీపంలో రాకుమారుడుగా.. మెప్పించారు. ఆ తరువాత పౌరాణిక పాత్రలు చేయాలనే ఆలోచనతో శ్రీ కృష్ణార్జున విజయం ఆశించినంత విజయం సాధించలేదు.
కానీ బాలకృష్ణకు ఇష్టమైన గుండమ్మకథ, నర్తనశాల రీమేక్ చేయాలనే ఆలోచన అలాగే మిగిలింది. 2004లో నర్తనశాల సినిమా రీమేక్‌కు రంగం సిద్ధం చేశారు. సౌందర్య ద్రౌపదిగా.. శ్రీహరి, శరత్‌బాబు, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు తారాగణంతో బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో కొంత షూటింగ్ కూడా జరిగింది. ఇంతలోనే ఊహించిన ప్రమాదం.. 2004 ఏప్రిల్ 17న బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ సౌందర్య బెంగళూరులో మరణించారు. ఆ తరువాత శరత్‌బాబుకు కారు యాక్సిడెంట్లో బలమైన గాయాలయ్యాయి. బాలకృష్ణ కూడా ఇంట్లో జరిగిన కాల్పుల కేసు వెంటాడింది. ఇలా ఎవరికి వారికే ఎదురైన చేదు అనుభవాలతో నర్తనశాల ఆగింది.
ఆ తరువాత తీయాలని ప్రయత్నించినా అలనాడు సావిత్రి ఆ తరువాత సౌందర్య అనుకున్న పాత్రలో మరో నటి ఎవరనే ప్రశ్న తలెత్తింది. 1963లో ఎన్టీఆర్, ఎస్వీరంగారావు, సావిత్రి వంటి మహామహానటులు నటించిన సినిమాలో ఈ తరం నటులు ఎవ్వరూ సరిపోల్చలేమనేది నిరూపితమైంది. కానీ బాలయ్యబాబు లో మాత్రం నర్తనశాల కలగానే మిగిలింది. అందుకే.. తండ్రిని గుర్తుచేసుకుంటూ.. ఈ నెల 24న నర్తనశాల 17 నిమిషాల నిడివిగల సినిమా విడుదల చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తామని బాలయ్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.



