ఒక్క చిన్నతప్పు.. అప్పటి వరకూ సంపాదించుకున్న కీర్తిని దూరం చేస్తుంది. ఒకే ఒక్క తప్పటడుగు అదఃపాతాళానికి నెట్టేస్తుంది. సమాజం.. కుటుంబం.. అవన్నీ దూరం గా నెడతాయి. పచ్చిగా చెప్పాలంటే ప్రపంచం నుంచి నిష్క్రమించే పరిస్థితులే వస్తాయి. ఏడాది వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు తహసీల్దార్ల జీవితాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కాస్త తర్కించి చూస్తే.. ఇదంతా నిజమే అనే భావనకు.. ఒళ్లు గగుర్బాటుకూ గురిచేస్తుందనేది అర్ధమవుతుంది.
అవినీతి.. ఒకప్పుడు అదనపు ఆదాయం. ఇప్పుడు అసలైన సంపాదన మార్గం. అప్పట్లో అవినీతి పరుడు జైలుకెళ్లొస్తే వెలివేసినంత పనిచేసేవారు. ఇప్పుడు అదే అవినీతిపరులకు పీఠమేసి కూర్చోబెట్టి గొప్ప గౌరవం ఇస్తున్నారు. జిల్లాలు. రాష్ట్రాలను కూడా వారి చేతుల్లో పెడుతున్నారు. కానీ.. అవినీతి కూడా పరాకాష్టకు చేరినపుడు దాని ఫలితం అనుభవించాల్సిందేనంటూ ఏడాది వ్యవధిలో ముగ్గురు తహసీల్దార్ల జీవితాలు గుర్తుచేస్తున్నాయి. మేమింతే.. అవినీతికే కట్టుబడి ఉంటామని వాదించే లంచగొండులను హెచ్చరిస్తున్నాయి.

2019 డిసెంబరు గుర్తుందా.. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయారెడ్డి విధుల్లో ఉన్నారు. ఇంతలో బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. ఆమెపై పెట్రోల్ పోయటం.. అగ్గిపుల్ల గీయటం వెనువెంటనే జరిగాయి. చెలరేగినమంటలు ఆమెను నిలువున దహనం చేశాయి. చంపేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరూ ఆ తరువాత మరణించారు. అసలు ఈ ఘటనకు కారణాలు ఏమిటో.. ఎవరిలా తెగించారనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. కానీ.. బడికెళ్లే ఇద్దరు పిల్లలకు అమ్మ ప్రేమ దూరమైంది. సజావుగా సాగే కాపురం ఒక్కసారిగా కుప్పకూలింది.

2020 జూన్ షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా పనిచేసే నాగార్జునరెడ్డి పెద్ద ఎత్తున లంచం తీసుకుంటూ ఏసీబీకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌లోని విలువైన ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి పరం చేసేందుకు రూ50లక్షలు లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఆ తరువాత పట్టిచ్చిన వ్యక్తి కూడా మాయగాడేనని తేలటంతో అరెస్టయ్యాడు. ఆ తరువాత అతడు తహసీల్దార్ సుజాత పేరు చెప్పటంతో తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు. ఆమె ఇంట్లో కూడా రూ.30 లక్షలు నగదు దొరికింది. దానికి లెక్కలు చూపకపోవటంతో ఏసీబీ అదికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జ్యుడిషయల్ రిమాండ్ లో ఉండనే.. సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్‌కుమార్ ఎత్తయిన భవనం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ మంచి పొజిషన్ లో ఉన్నారు.. ఒక్కగానొక్క కొడుకు పెద్ద చదువులు చదువుతున్నాడు. కానీ.. ఒకే ఒక్క తప్పు.. ఇంటిని చిన్నాభిన్నం చేసింది.
2020 అగస్టు.. కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1 కోటి లంచం తీసుకుంటూ ఏసీబీకు చిక్కాడు. రికార్డు స్థాయిలో తీసుకున్న లంఛాన్ని గిన్నిస్ బుక్‌లోకి చేర్చాలంటూ ఎవరో నిర్వాహకులను సంప్రదించారట కూడా. ఈ కేసులో మరో నలుగురు కూడా అరెస్టయ్యారు. 15 ఏళ్ల క్రితం చిరుద్యోగిగా అది కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా కొలువు పొందిన నాగరాజు.. తహసీల్దార్ స్థాయికి చేరాడు. సమాజంలో గౌరవంతోపాటు. గట్టిగా సంపాదించాడు కూడా. కానీ.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఇంతలో ఏమైందో.. జైల్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కోట్లాదిరూపాయల ఆస్తిపాస్తులున్నా.. ఒక్క రూపాయి కూడా నాగరాజును కాపాడలేకపోయాయి. కానీ.. నాగరాజు మరణం వెనుక దాగిన మిస్టరీను బయటకు తీసేందుకు న్యాయపోరాటం చేస్తానంటూ ఆయన భార్య చెబుతోంది.




