రైతన్నలు పొలంలో పడుతున్న కష్టాలు. చేను గట్టున కూర్చుని తినే సద్దన్నం. అవకాశం దొరికిన ప్రతిసారీ ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చేయటం.. తామేదో రైతులను ఉద్దరించే సామాజికవేత్తలుగా బిల్డప్ ఇవ్వటం చూస్తూనే ఉంటాం. ఇంత గొప్పగా పోస్టులు పెట్టే ఎవరైనా రైతును గౌరవించారా అంటే అనుమానమే. పైగా.. మురికిబట్టలతో ఎదురుగా వస్తే తప్పుకుని వెళ్లే బ్యాచ్ ఎక్కువ. ఊళ్లో పాడిపంటలు పుష్కలంగా ఉన్న కుటుంబంలో ఇంట్లో పెళ్లికాని ప్రసాద్‌లు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే.. ప్రతి ఒక్కరికీ పట్నం, నగరాల్లో ఉండే వాళ్లే కావాలి. చిన్న గదిలో ఊపిరాడక.. బతికే బతుకే బావుంటుందనే అపోహ. పల్లెటూళ్లో రైతు ఇంటికి కూతుర్ని పంపాలంటే ఎంతోమంది నామోషీగా భావిస్తుంటారు. అప్పులు.. అవస్థలతో పట్నంలో గొడ్డుచాకిరీ చేసే గుమాస్తాలకు ఉన్న డిమాండ్ పెళ్లి మార్కెట్లో రైతు బిడ్డలకు లేకపోవటం ఆందోళన కలిగించేది.

అందుకే.. దీనికి పరిష్కారం చూపాలనే సంకల్పంతో కరీంనగర్ జిల్లా కేతిరెడ్డి అంజిరెడ్డి అనే వ్యక్తి.. రైతు మ్యారేజ్‌బ్యూరో ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైతు కుటుంబాలకు కుల, మత ప్రసక్తి లేకుండా సర్వీసు చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించినట్టు చెప్పారు. కొద్దిరోజుల్లోనే మంచి స్పందన లభించటం ఆనందంగా ఉందంటారు అంజిరెడ్డి. ఒక్కో రిజిస్ట్రేషన్ కింద రూ.500కు తీసుకుంటున్నారు. అయితే పేద రైతులైతే ఉచితంగానే సేవలు అందిస్తున్నారు.



