కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తుంది. నీ. నా అను తేడాలేకుండా అన్నింటా తానే ఉన్నానంటూ సునామీగా మీద పడుతోంది. ఇప్పటికే యూరప్ దేశాలు చేతులెత్తేశాయి. అందాకా ఎందుకు.. నిన్నటి వరకూ భారత్‌లో రోజుకు 30 వేల కొవిడ్ కేసులకు తగ్గిందనుకుని ఊపిరిపీల్చుకున్నాం.. ఇంతలోనే 50 వేల కేసులకు చేరటంతో ఇండియాలోనూ సెకండ్‌వేవ్ ఎంతటి బీభత్సం సృష్టించబోతుందనే చెప్పకనే చెబుతుంది. ఏపీలో పాఠశాలలు తెరవటంతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. వందలాది మంది విద్యార్థులు వైరస్ భారీనపడ్డారు. ఢిల్లీలో ప్రభుత్వం తల పట్టుకుంది. రేపు దీపావళి రోజున ఇంకెంతగా కరోనా దాడి చేస్తుందనే భయం లేకపోలేదు. దీనంతటికీ కారణం.. కేవలం ప్రజల నిర్లక్ష్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు.
నెల రోజుల క్రితం వరకూ బయటకు వచ్చిన వారిలో ఏ ఒక్కరిద్దరో మినహా అందరి ముఖానికి మాస్క్‌లు ఉండేవి. ఇప్పుడు.. ఏ ఒక్కరో తప్ప మాస్క్ ధరించట్లేదు. ముఖ్యంగా నగరాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇక్కడ ఆందోళన పడాల్సిన మరో విషయం ఏమిటంటే.. వైరస్ భారీన పడుతున్న వారిలో21-36 ఏళ్ల మధ్య ఉన్న మగాళ్లు 80శాతం ఉంటున్నారు. పెళ్లి కావాల్సిన వయసులో.. కుటుంబానికి ఆధారమైన సమయంలో వీరు వైరస్‌కు గురవటం కుటుంబాలను భయపెడుతుంది. హిందువులు, ముస్లింల పండుగలు.. వివాహ వేడుకలతో జనం ఒకేచోట భారీగా చేరుతున్నారు. షాపుల వద్ద అసలు నిబంధనలు వదిలేశారు.
ఇదంతా బాగానే ఉందనే భావన కలిగిస్తున్నా.. ముప్పు పొంచి ఉందని .. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోవటం ఖాయమంటూ సీసీఎంబీ హెచ్చరించింది. సెకండ్‌వేవ్ ఎంత ఉదృతంగా ఉండబోతుందనే అంశంపై సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ శర్మ పలు సంచలనమైన అంశాలను వెల్లడించారు. నవంబరు నుంచి 2021 మార్చి వరకూ సెకండ్‌వేవ్‌లో వైరస్ విరుచుకుపడుతుంది. రెండేళ్ల వరకూ వైరస్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ వచ్చినా 130 కోట్ల మందికి వ్యాక్సిన్ చేరేందుకు మరో రెండేళ్ల సమయంపడుతుంది. మరి అప్పటి వరకూ ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే.. ప్రాణాల మీదకు కొని తెచ్చుకున్నట్టేనట. అందరూ అనుకున్నట్టుగా.. కరోనా వైరస్ బలహీనపడలేదట. శీతాకాలం మరింత తేలికగా.. శరీరంలోకి చేరి
నరకాన్నిచూపుతుందంటున్నారు. రాబోయే మూడు నెలల వరకూ పెళ్లివేడుకలు ఉన్నాయి. దీపావళి, క్రిస్‌మస్, న్యూ ఇయర్, సంక్రాంతి.. అందరితో సరదాగా గడపటం మంచిదే కానీ.. కంటికి కనిపించని కరోనా వైరస్ ఉందనే అంశాన్ని విస్మరించటమే అసలు సిసలైన ప్రమాదం.



