నారా చంద్రబాబునాయుడు.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే సీబీఎన్. అసలు సిసలైన రాజకీయ నాయకుడు. అంతకు మించి విజన్ ఉన్న లీడర్. రాజకీయం అంటేనే రాజకీయాలు చేయాలి. లేదంటే జనాన్ని మెప్పించి అధికారంలోకి రావటం ఆ పార్టీలకు కలగానే మిగిలిపోతుంది. జాతీయపార్టీల్లో వామపక్షాలు, బీజేపీ కూడా మొదట్లో సిద్ధాంతాలను నమ్ముకుని జనాల్లోకి వెళ్లాయి. కానీ రాజకీయాలు చేయటం ప్రారంభించిన తరువాతనే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఎటుచూసిన రాజకీయ పార్టీలంటే రాజకీయమే అని భావించాలి. అక్కడ నాయకుడు ఎంత చురుగ్గా వ్యూహాలు పన్నుతున్నాడు. తన వారిని ఎలా నెగ్గేలా చేస్తున్నాడనేది మాత్రమే ప్రామాణికత. ఇక్కడ మిగిలిన నిబంధనలకు తావుండదనేది కొత్త రాజకీయ సిద్ధాంతం.
2004లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనప్పటికే పదేళ్ల టీడీపీ పాలనపై వ్యతిరేకత ఉంది. దాన్నుంచి బయటపడేందుకు అలిపిరి వద్ద తనపై జరిగిన దాడిని సానుభూతికి మలచుకుందామనే ప్రయత్నంలో అప్పటికే పాదయాత్రతో మాంచి జోష్ మీదున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తక్కువ అంచనా వేశారు. 2009లో మహాకూటమిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి ప్రయత్నంలోనూ ఫెయిల్ అయ్యారు. ఆ నాడు ప్రజారాజ్యం పార్టీతో వచ్చిన చిరంజీవి ప్రభావం కాంగ్రెస్ పై పడుతుందనుకుంటే.. అది కాస్తా టీడీపీ విజయానికి అడ్డుగోడగా మారింది. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు ఇటు కేడర్‌ను.. అటు లీడర్‌షిప్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ జనంలోకి వెళ్లారు.
2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికలు. అప్పటికే వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఓదార్పుయాత్రతో జగన్ జనంలో సానుభూతి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడుగా ముద్ర వేయించుకున్నాడు . ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే.. దాదాపు పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారేది. అక్కడే చంద్రబాబు చాణక్యత ప్రదర్శించాడు. ఒకప్పుడు ఛీ కొట్టిన బీజేపీతో దోస్తీ. మరో వైపు 2009లో టీడీపీను దెబ్బతీసిన చిరంజీవి కుటుంబం నుంచే పవన్ కళ్యాణ్ తో మైత్రి. దాదాపు ఓటమి ఖాయమనుకున్న టీడీపీను ఎవరూ ఊహించని విధంగా అధికారంలోకి తీసుకు రాగలిగారు. క్రమంగా ఎన్ డీఏతో తగవులు.. మరో వైపు దేశవ్యాప్తంగా బీజేపీ విధానాల పట్ల వ్యతిరేకత రావటంతో చంద్రబాబు కూడా బీజేపీ పని అయిపోయిందనే భావించారు. అందుకే.. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో దోస్తీ చేశారు. అది చారిత్రక అవసరమని ఎంతగా చెప్పినా జనం మాత్రం హస్తం పార్టీతో తెలుగు వారి ఆత్మాభిమాన ప్రతీకగా ఉన్న టీడీపీ స్నేహాన్ని చారిత్రక తప్పిదంగానే భావించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏపీలో టీడీపీను అదే దెబ్బతీసింది. ఐదేళ్ల క్రితం టీడీపీకు బలంగా నిలిచిన జనసేన, బీజేపీ రెండూ దూరం కావటంతో మరింత ఘోర పరాజయం నుంచి టీడీపీ తప్పించుకోలేకపోయింది.
2023-24 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సత్తా చాటేందుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. దానికి తగినట్టుగానే పాత తప్పులను బేరీజు వేసుకుంటూ.. ప్రత్యర్థుల బలాలను అంచనా వేస్తూ వచ్చే ఏడాదే ఎన్నికలు అనేంతగా సీబీఎన్ పావులు కదుపుతున్నారు. ఏడాదిన్నర పాలనలో వైసీపీ పట్ల పెల్లుబుకి వ్యతిరేకతను తాము ఎలా క్యాష్ చేసుకోవాలనే పథకరచనలో టీడీపీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే.. టీడీపీ ఏపీ అధ్యక్షుడుగా అచ్చె్నాయుడును ముందు ఉంచి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. మహిళలకు పార్టీలో కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా మున్ముందు ప్రభుత్వ పదవుల్లోనూ వారికే పెద్దపీట అనే సంకేతాలు పంపారు.
వాస్తవానికి అందరూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నపుడు కుంగిపోతారు. కానీ.. దీనికి భిన్నంగా చంద్రబాబునాయుడు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారనే నానుడి ఉంది. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలంటూ తరచూ పిలుపునిచ్చే చంద్రబాబు ప్రస్తుత సంక్షోభసమయంలోనూ అవకాశాలను వెతుకుతున్నారు. విజన్ ఉన్న నేతగా.. ఏదైనా పట్టుబడితే సాధించేంత వరకూ పట్టువీడని నాయకుడుగా చంద్రబాబుకు గుర్తింపు ఉంది. గెలుపోటములకు అతీతంగా.. చంద్రబాబు.. చంద్రబాబే అనే జనాలు ఉన్నారు. కానీ చుట్టూ ఉన్న కోటరీ వల్ల తరచూ చంద్రబాబు సంక్షోభంలోకి రావాల్సి వస్తోందంటూ సొంతపార్టీ నేతలు ఆవేదన వ్యక్తంచేస్తుంటారు. అయినా పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో పైకి లేచి.. ఇదే చంద్రబాబు అంటూ సత్తా చాటుతున్న బాబు ఈ సారి ఎలాంటి వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తారనేది ఆసక్తిగా మారింది.