ఆమె పాదాలు.. నెమలికి నాట్యం నేర్పుతాయి. కనుబొమలు నృత్యానికి కొత్త అర్ధం వెతుకుతాయి. తాను వేదికపై ఉంటే చాలు కరతాళధ్వనులు స్వాగతం పలుకుతాయి. కూచిపూడిని ఇంటి పేరుగా.. శ్వాసగా మార్చుకున్న గొప్ప నాట్యకారణి పద్మశ్రీ కె.శోభానాయుడు.. ఇటీవల ఆమె ఆకస్మిక మరణం… నాట్యకళను కలవరపాటుకు గురిచేసింది. ఆమెను స్మరించుకుంటూ శోభానాయుడు తొలి శిష్య బృందం బుధవారం హైదరాబాద్ లకిడికపూల్ హోటల్ సెంట్రల్ కోర్ట్ లో సమావేశమయ్యారు. ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు! శోభానాయుడు స్థాపించిన శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీ, పద్మజారెడ్డి గ స్థాపించిన ప్రణవ్ కూచిపూడి డాన్స్ అకాడమీ, శ్రీ బి.నాగయ్య శ్రీ సాయి మానస సరోవర్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్, కళ పత్రిక సంయుక్త ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరిగింది. దర్శకుడు డాక్టర్ కె.విశ్వనాధ్, పూర్వ ఎంపీ మురళీమోహన్, నృత్య పరిశోధకులు డాక్టర్ జయంత్ కస్తూర్ ముఖ్య అతిధులుగా తమ వీడియో సందేశాలు పంపించారు. శోభానాయుడు కుమార్తె సాయి శివరంజని బృందం రాజ రాజేశ్వరి అష్టకంతో నృత్య నివాళి సమర్పించారు.
కళాకృష్ణ, అమలాపురం కన్నారావు, అన్నమయ్య శంకరరావు, బి.ఎస్.రావు, కె.కె.రాజా, డాక్టర్ వనజా ఉదయ్, సుమలత, సుజాతామూర్తి, విజయ శాస్త్రి, డాక్టర్ యశోద ఠాకూర్, అనితా గౌడ్, రమణి సిద్ధి, భాస్కర్, రఘునందన్ తదితరులు పాల్గొని తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. డాక్టర్ జె.అనూరాధ, డాక్టర్ పద్మజా రెడ్డి, శ్రీ బి.నాగయ్య, డాక్టర్ మహ్మద్ రఫీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.