చిరంజీవిలో దాగిన నటుడుని సినీ పరిశ్రమ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతుంది. ఖైదీ, గూండా, రుస్తుం, ఛాలెంజ్ అక్కడే ఆగిపోతే ఎలా.. నీలో నటుడు బయటకు రావాలంటే విభిన్నపాత్రలు పోషించాలి. అంతర్గతంగా దాగిన నటనను వెలికితీయాలంటే ఎన్నో పాత్రలు పోషించాలి.. ఇదీ మెగాస్టార్ చిరంజీవి గురించి కళాతపస్వీ కాశీనాథుని విశ్వనాథుడి అంతరంగం. నిజమే.. ఒక శుభలేఖ, స్వయంకృషి, అపద్బాంధవుడు వంటి సినిమాలు ఇద్దరూ కలసి చేయకపోతే.. చిరంజీవిలోని హీరోయిజం చూసిన ప్రేక్షకులకు కొణిదెల శివశంకర ప్రసాద్ లో దాగిన నటుడు కనిపించేవాడు కాదేమో. శుభలేఖలో హోటల్ సర్వర్‌గా.. స్వయంకృషిలో చెప్పుల సాంబయ్య.. అపద్బాంధవుడులో పాలమ్మే యాదవుడుగా మాదవ్ నటన ఇవన్నీ చిరులో కొత్త కోణాలు. ఎదిగేందుకు ఆసరా.. ఎగిరేందుకు రెక్కలు అవసరం లేదు.. శ్రమలోనే దాగుందని చాటిన సినిమా స్వయంకృషి. ఆ సినిమా కోసం చిరంజీవి చెప్పులు కుట్టేవారిని పిలిపించుకుని మరీ.. చెప్పులు కుట్టే విధానం గురించి తెలుసుకోవటమే కాదు.. తానే సాధన చేశారట. అందుకే.. శివశంకర ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారంటారు అభిమానులు.
దీపావళి పండుగ రోజు.. సతీసమేతంగా గురువు విశ్వనాథ్ ఇంటికి చిరంజీవి దంపతులు వెళ్లారు. పండుగ రోజున పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పట్టువస్త్రాలతో గౌరవించి.. కొద్దిసేపు ఆదిదంపతులతో గడపి వచ్చారు. కె.విశ్వనాథ్.. కృష్ణమ్మ ఒడ్డున రేపల్లెలో పుడితే.. మెగాస్టార్ చిరంజీవి గోదావరి పరవళ్ల మధ్య మొగల్తూరులో జన్మించారు. పారే నీరులా.. ఇద్దరూ నిత్యం కొత్తదనం కోసం పరితపిస్తూ.. సినీ జగత్తులో తమకంటూ పేజీలు భద్రపరచుకున్నారు. ఎంతమందితో సినిమా తీసినా.. నా ప్రియశిష్యుడు చిరంజీవి అని గర్వంగా చెప్పగలరు విశ్వనాథ్. సినీ రంగంలో ఎందరు పెద్దలున్నా.. తన గురువు విశ్వనాథ్ అంటూ.. సగర్వంగా చెబుతూ.. గురువు పాదాల చెంత ఒదిగిపోయిన శిష్యుడు.. ఇద్దరూ ఇద్దరే.. నిత్య కృషీవలురు. రేపటి తరానికి స్పూర్తినందించే మార్గదర్శకులు. జీవితానికి దిశానిర్దేశం చేసిన దార్శనీకుడు ఒకరు.. పండుగరోజు పుత్రవాత్సల్యంతో ఒదిగిపోయిన కృషీవలుడు మరొకరు. అభిమానులకే కాదు.. గురుశిష్యులుగా ఇద్దరూ ఇద్దరే. తెలుగు చలన చిత్ర సీమలో రారాజులే.
https://www.instagram.com/p/CHkip6MjSNV/