రవికుమార్ అనే 34 ఏళ్ల వ్యక్తి.. ఆయాసం. శ్వాస అందక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆయన తండ్రి చేతిలో లక్షలు పట్టుకుని రెండ్రోజుల పాటు 11 ఆసుపత్రులు తిరిగాడు. చివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చితో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 55 ఏళ్ల వ్యక్తి అంబులెన్స్‌లో రెండ్రోజులు ఏకంగా 60 ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. చివరకు ఎవరో రికమండేషన్ చేస్తే.. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చోటిచ్చారు. చేరిన రెండు గంటలకు కనుమూశాడు. సయ్యద్ అనే మైనార్టీ వ్యక్తి.. ఆసుపత్రిలో చేరి రెండున్నర గంటలకే తిరిగిరాని లోకాలకు చేరాడు. ఈసీఐఎల్‌లో ఓ యువకుడు కరోనాతో ఏ ఆసుపత్రిలో చేర్చుకోలేకపోవటంతో రోడ్డుమీద కుప్పకూలాడు. 108 వాహనంలో వచ్చిన వైద్యసిబ్బంది పరీక్షించి యువకుడు మరణించినట్టు ధ్రువీకరించారు. ఇవన్నీ హైదరాబాద్ మహానగరంలో జరిగిన సంఘటనలకు ఉదాహరణ మాత్రమే. గాంధీలో సకాలంలో వైద్యం అందక.. మనోజ్ అనే టీవీ5 రిపోర్టర్ మరణించాడు. ఉన్నతస్థాయిలో పరిచయాలు కూడా కష్టాన్ని ఆదుకోలేకపోయాయి. ఇపుడు మరో జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి ఊపిరి అందక.. మంత్రి హరీష్‌రావుకు మొరపెట్టుకుంటూ వీడియో విడుదల చేస్తే.. యశోదాలో చేర్చారు. మొన్న మంత్రి ఈటల పుణ్యమాంటూ ఓ నిండుజీవికి ఆసుపత్రిలో వైద్యం దొరికింది. కానీ.. అందరికీ మంత్రుల సాయం సకాలంలో అందకపోవచ్చు. కరోనా వైరస్ చుట్టూ తెలియని హైడ్రామా నడుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పూటకోమాట మార్చుతూ మానవాళిని ఎటూతేల్చుకోకుండా చేస్తుంది. హైడ్రోక్లోరోక్విన్ మాత్రలు మంచిదేనంటూ ఒకసారి.. తూచ్ కాదంటూ మరోసారి భయపెడుతోంది. కోటి జనాభా ఉన్న రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది సొంతూళ్లు చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎటుచూసినా టులెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంటి యజమానులు కూడా కొత్తవాళ్లకు ఇళ్లను అద్దెకు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. ఇటువంటి దయనీయ స్థితిలో కరోనా మున్ముందు తీవ్రంగా విజృంభించే అవకాశం ఉందని మంత్రి తలసాని హెచ్చరించారు. అయినా ప్రజలు భయపడవద్దంటూ ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. మంత్రులు, ఎమ్మెల్యేలకూ కరోనా ముప్పు తప్పట్లేదు. వారికంటే కోట్లున్నాయి.. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం దొరుకుతుంది. కానీ.. బస్తీల్లో బతికే కూలీలు, కాలనీల్లో ఉండే మధ్యతరగతి కుటుంబాల
పరిస్థితి అగమ్యగోచరం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. కరోనా కట్టడిని గాలికొదిలేసి..కేవలం కొత్త సచివాలయం నిర్మాణంపై ఎందుకింత యావ అంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వరు. కరోనా వైద్యపరీక్షలు లేవు. సర్కారు దవాఖానాల్లో ఆక్సిజన్ అందదు. వీటికోసం వెచ్చించాల్సిన డబ్బును ఇలా.. కొత్త సచివాలయం పేరుతో వృధాచేయటాన్ని తప్పుబట్టారు. వారం రోజులుగా కేసీఆర్ పాలనా వ్యవహారాల్లో
కనిపించకపోవటం పట్ల రకరకాల విషప్రచారాలు మొదలయ్యాయి. ఇవన్నీ నిజమేనా.. ప్రతిపక్షాలు.. ప్రత్యర్థులు కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారమా అనేదానిపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.