అబ్బే.. బొత్తిగా రాజకీయం తెలియదండీ. ఇతడి కంటే వీళ్ల అన్నయ్యే బెటర్. అసలు నిలకడే ఉండదు. ఏం చేస్తున్నాడనేది అర్ధం కాదు. ఇతగాడికి రాజకీయాలెందుకు. హాయిగా ఫామ్‌హౌస్‌లో గోవులు మేపుకుంటూ.. పిల్లలతో ఆడుకుంటే సరిపోతుంది. అయినా.. జగన్ పాలన బ్రహ్మాండంగా ఉన్నపుడు పవన్ వచ్చి ఏం చేస్తాడు. బొత్తిగా రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి.. భవిష్యత్‌లో గెలవటం కూడా కష్టమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో అయినోళ్ల నోళ్ల నుంచి .. పక్కోళ్ల విమర్శల నుంచి వచ్చిన పోస్టులు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టంచుకోడు. ఎవరూ నాకు శత్రువులు కాదంటాడు. ఆపదలో ఉన్నోళ్లకి బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఉన్నదంతా దారపోస్తాడు. ఆకలేస్తుందంటే చాలు.. తన కంచెంలో మెతుకులు పంచుతాడు. పక్కోడికి కష్టం వస్తే కన్నీరు పెడతాడు. మిత్రుడి కాలికి ముల్లు గుచ్చుకుంటే తాను విలవిల్లాడతాడు. ఓటమిలోనూ ముందుండి నడిపిస్తున్న నాయకుడు. అందుకే.. ఓటమిలోనూ ఆయన వెంటే ఉంటామంటూ గర్వంగా చెబుతున్నారు మెగా అభిమానులు, జనసైనికులు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు దాదాపు 60 మంది నామినేషన్లు వేశారు. బీజేపీతో పొత్తు సంగతి అప్పటికి ఫైనలైజ్ కాలేదు. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ విషయంలో పక్కాగా ఉన్నారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చిచెప్పారు. జనసేన పోటీ చేస్తే ఓట్లు చీలుతాయి. అది తప్పనిసరిగా బీజేపీ ఓటమికి కారణమవుతుందనేది ఆ పార్టీ సీనియర్లు గుర్తించారు. అందుకే ఆగమేఘాల మీద పవన్ ను కలసి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ మంతనాలు జరిపారు. పవన్ కూడా బీజేపీను లబ్ది చేకూరాలనే ఉద్దేశంతో తమ పార్టీ అభ్యర్థులను పోటీ నుంచి విరమించేలా చేశారు. బీజేపీ గెలుపుకోసం జనసైనికులు ఆయా డివిజన్లలో ప్రచారం చేయాలని ఆదేశించారు. పవన్ ప్రచారంతో పెద్దగా పోయేదేం లేదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అదేనండీ టీఆర్ ఎస్ కూడా తక్కువగా అంచనా వేసుకుంది. కానీ. జనసైనికులు మాత్రం సేనాని ఆదేశాలకు అనుగుణంగా 40 డివిజన్లలో విపరీతంగా ప్రచారం చేశారు. బీజేపీ అగ్రనేతలు నడ్డా, అమిత్‌షా వంటి వారి పర్యటనలకు వచ్చినపుడు కూడా భారీగా జనసమీకరణ చేసి బండి సంజయ్ నాయకత్వాన్ని బలపరిచారు. టీఆర్ ఎస్ ఓట్లకు పరోక్షంగా చీలిక తీసుకురాగలిగారు.
ఇదే సమయంలో ప్రకాశ్‌రాజ్ వంటి సీనియర్ నటుడు పవన్ బీజేపీతో పొత్తుపై దారుణంగా విమర్శించాడు సేనాని ఊసరవెల్లి అంటూ పోల్చాడు. టీఆర్ ఎస్‌ను ఎదుర్కోవటం ఎవరి వల్లా కాదంటూ బీష్మ ప్రతిన బూనాడు. దీనికి ప్రతిగా నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. టీఆర్ ఎస్ అగ్రనేతలు కేటీఆర్, కవిత, హరీష్‌రావు వంటి నేతలు పవన్ ప్రచారంతో బీజేపీకు వచ్చే లాభం ఏం లేదంటూ పెదవి విరిచారు. డిసెంబరు 4న ఫలితాల్లో పవన్ సత్తా తేలుతుందంటూ ఎద్దేవా చేశారు. అనుకున్నట్టుగానే.. డిసెంబరు 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ కూడా ఊహించనంతగా 50 సీట్లు సాధించుకుంది
వీటిలో మోండామార్కెట్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ వంటి చోట్ల పవన్ ప్రభావం వల్లనే తాము గెలిచినట్టుగా బీజేపీ అభ్యర్థులు గర్వంగా చెబుతున్నారు. కానీ.. వైసీపీ, తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం.. హైదరాబాద్‌లో బీజేపీ పట్టు సాధించేందుకు పవన్ కారణమని బయటపడితే.. ఏపీలో తెలుగుదేశం, వైసీపీపై ఆ ప్రభావం పడుతుందనే అంచనా వేసుకున్నారు. అందుకే.. సీమాంధ్రులు టీఆర్ ఎస్ వైపు ఉన్నారంటూ తప్పుడు ప్రచారానకి శ్రీకారం చుట్టారు. దానికి అమరావతి రాజధాని కారణమంటూ మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ.. బీజేపీ మాత్రం పవన్ మాట అంటే కార్యకర్తలు, అభిమానులు ఎంతగా ప్రాణం పెడతారనే విషయం జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తాము చూశామంటున్నారు.