నిజమే.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని దిశానిర్దేశం చేసిన నాయకుడు. రాష్ట్ర సాధనలో తనదైన శైలితో విజయం సాధించిన ఉద్యమకారుడు. కానీ… ఎందుకో రాజకీయంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో కాస్త లక్ వెనక్కి లాగుతున్నట్టుంది. ఢిల్లీతో కోట్లాడి మరి ప్రత్యేక తెలంగాణ సాధించిన కేసీఆర్.. అదే ఢిల్లీ రాజకీయాలపై పట్టు సాధించటంలో విఫలమవుతున్నారు. నిజానికి ఉత్తరభారత నేతలు ఉన్నంత కీలకంగా జాతీయ రాజకీయాల్లో దక్షిణాధి నేతలు కనిపించరు. దీనికి ప్రధాన సమస్య భాష. ఉత్తరాధిన హిందీ కీలకం. చంద్రబాబు, జగన్ వంటి నేతలకు తెలుగు నాట మంచి క్రేజ్ ఉన్నా జాతీయరాజకీయాల్లో రాణించేందుకు వారి హిందీ మాట్లాడటం అవాంతరంగా మారుతోంది. కేసీఆర్‌కు అలా కాదు.. నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. హిందీ, ఉర్దూలో ప్రావీణ్యం ఉంది. అయితే.. వచ్చిన చిక్కల్లా.. జాతీయరాజకీయాలకు సరైన రూటు. కలసొచ్చినట్టుగా అనిపించిన ప్రతిసారీ హస్తిన మార్గాలు మూసుకు పోతున్నాయి. అదెలా అంటారా..
2018 ముందస్తు ఎన్నికలకు ముందు కేసీఆర్ వ్యూహం వేరు. పక్కా ప్రణాళికతో ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటికే ఎన్డీఏ కూటమిపై ముఖ్యంగా నరేంద్రమోదీ నాయకత్వంపై అసహనం పెరిగినట్టుగా మేధావుల నిరసనలు వినిపించాయి. దీన్ని ప్రభుత్వ వ్యతిరేకతగానే చంద్రబాబు, కేసీఆర్ భావించారు. అందుకే.. 2018లో మూడో కూటమి పేరుతో కేసీఆర్ 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్‌తో జతకట్టాడు. ఇద్దరి అంచనాలు తలకిందులయ్యాయి. వాస్తవానికి 2019లో బీజేపీ ఓడినట్టయితే కేసీఆర్ మూడో కూటమికి సారథ్యం వహించేవారు. తద్వారా తన ఢిల్లీ రాజకీయం నెరవేరేది.
కానీ ఆ ఎన్నికల్లో నరేంద్రమోదీ తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆ తరువాత 2020 జీహెచ్ ఎంసీ ఎన్నికలు ముగియగానే ఢిల్లీపై దండయాత్ర చేయాలని కేసీఆర్ అనుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో ఢిల్లీలో రైతులు ధర్నాకు మద్దతు ప్రకటించటమే కాదు.. అధికార ప్రభుత్వం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చింది కూడా. అయితే దేశ రాజకీయాల్లో బీజేపీ పునాదులు గట్టిగా ఉన్నాయనేది బిహార్ ఎన్నికల ద్వారా నిరూపితమైంది. రేపటి తమిళనాడు ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం కానుందనే విశ్లేషణలూ లేకపోలేదు. ప్రధాని మోదీ జమిలీ ఎన్నికల ప్రకటనతో కేసీఆర్.. రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారించారు. ఢిల్లీ అని కూర్చుంటే గల్లీలో పీఠం కదులుతుందనే ముందుచూపుతో జిల్లా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఢిల్లీపై దండయాత్ర అనుకున్న ప్రతిసారీ ఎందుకో కాలం ఇలా వెనక్కి లాగుతుందంటూ గులాబీ శ్రేణులు తెగ గుస్సా అవుతున్నారట.