తాడిపత్రి హీటెక్కింది. ఏ క్షణాన ఏం జరుగుతుందనేది తెలియకుండా ఉంది. దీంతో పోలీసులు ఈ నెల 29 వరకూ 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఇది రాజకీయ వైరం కాదని.. కేవలం ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న వ్యక్తిగత వైరంగానే తాము చూస్తున్నామంటున్నారు పోలీసులు. అనంతపురం జిల్లాలో తాడిపత్రి ఫ్యాక్షన్ తగాదాలకు కేరాఫ్ చిరునామా. అటువంటి చోట జేసీ సోదరులదే హవా. కానీ..గత ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. వైసీపీ గెలిచి అధికారంలోకి రావటంతో. జేసీ బ్రదర్స్‌లో భయం మొదలైంది. దివాకర్ ట్రావెల్స్ చుట్టూ ఉచ్చు బిగించారు. స్ర్కాప్ వాహనాలకు పర్మిట్లు తెచ్చుకుని వాటిని బస్సులుగా మార్చి తిప్పటంపై కేసులు నమోదైంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి 14 రోజులు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండి వచ్చారు. విడుదలైన రోజు కూడా మరో కేసు నమోదైంది. అనంతరం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మైనంగ్‌పై పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ మైనింగ్ శాఖ నోటీసులిచ్చింది.
ఇటువంటి పరిస్థితుల్లోనే వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురువారం జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లటం సంచనలనంగా మారింది. తనకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతో తన నిరసన తెలిపేందుకు వెళ్లానంటూ పెద్దారెడ్డి వివరణ ఇచ్చాడు. తన గురించి విష ప్రచారం చేసేందుకు ఒక వ్యక్తిని నియమించారంటూ ఆరోపణలు చేశారు. ప్రభాకర్‌రెడ్డి కూడా దీనిపై స్పందించారు. తాను హైదరాబాద్‌లో ఉన్నపుడు తన ఇంటికెళ్లటం ధైర్యం కాదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదంటూ కొట్టిపారేశారు. ఇరువర్గాలు భారీగా మోహరించటంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. 144 సెక్షన్ విధించారు. మున్ముందు ఇంకెటువంటి పరిస్థితికి దారితీస్తుందనేది తాడిపత్రి ప్రజల ఆందోళన. ఇప్పటికే అనంతపురంలో పరిటాల కుటుంబంపై ఎంపీ మాదవ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనిపై పరిటాల సునీత, శ్రీరామ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు జేసీ బ్రదర్స్ వర్సెస్ పెద్దారెడ్డి మధ్య రగిలిన చిచ్చు ఏ విధంగా మారుతుందనే ఆందోళన కూడా లేకపోలేదు.



