మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్ హిట్ అందుకున్నాడు. తొలిసినిమాతోనే ఎన్నో అంచనాలు పెంచిన వైష్ణవ్ ఉప్పెనతో శుక్రవారం థియేటర్లలో హల్చల్ చేశాడు. దర్శకుడు సాన బుచ్చిబాబు అద్భుతంగా తీర్చిదిద్దిన తీరుపై 80శాతం ప్రేక్షకులు ఔరా అంటూ ప్రశంసలు కురిపించారు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో మేనమామ చిరంజీవితో కలసి నటించిన బుడతడు.. హీరోగా ఉప్పెనతో వెండితెరపై అరంగేట్రం చేశారు. చిరంజీవి మేనల్లుడు అనగానే ఎన్నో అంచనాలు.. మరెన్నో లెక్కలు. అంతకు మించిన ప్రత్యర్థుల విమర్శలు ఉండనే ఉంటాయి. ఇవన్నీ దాటుకుని వచ్చిని సినిమా మరో రంగస్థలం మాదిరిగా ఉంటుందంటూ చిరంజీవి బహిరంగంగా ప్రకటించటంతో ఒక్కసారిగా సినిమాపై అంచనా రెట్టింపునకు చేరింది. లెక్కల మాస్టారు సుకుమార్ టీమ్ నుంచి వచ్చిన గోదావరి కుర్రాడు బుచ్చిబాబు తాను కూడా తక్కువేమీ కాదని నిరూపించాడు. కథా ఎంపికలోనే వైవిధ్యం.. విలన్ గా విజయ్‌సేతుపతి నటన.. హీరోయిన్గా కృతి శెట్టి కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఎవరికి వారే.. తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హీరో, హీరోయిన్లు ఇది తమ మొదటి సినిమా అనేలా గాకుండా.. ఎంతో అనుభవం ఉన్న నటులుగా పోటిపడి నటించారు. సంగీత సామ్రాట్ దేవీశ్రీ ప్రసాద్ తనదైన ముద్ర మరోసారి వేసుకున్నారు. ముఖ్యంగా బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లాడు. దర్శకుడు బుచ్చిబాబు తనపై మెగాస్టార్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కథలో.. వైవిధ్యం.. దర్శకత్వంలో సరికొత్తదనం రెండింటిని మేళవించి నిజంగానే సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు. కలెక్షన్ల ఉప్పెనతో బాక్సాఫీసు వద్ద విరుచుకుపడుతున్నాడు.