నందిగామ నగర పంచాయతీ ఎన్నికలు ప్రచారం వేడెక్కింది. ఎవరికి వారే పైకి ధీమాగా కనిపిస్తున్నా లోలోన గుబులు వెంటాడుతోంది. 1994కు ముందు వరకూ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం క్రమంగా పట్టు సడలుతూ 2019 నాటికి క్షీణదశకు చేరింది. ఫలితంగా అప్పటికే పదేళ్లుగా అక్కడే వైసీపీ సమన్వయకర్తగా మకాం వేసిన డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు ఆయన సోదరుడు అరుణ్‌కుమార్ చాణక్యం వర్కవుట్ అయింది. తెలుగుదేశం కంచుకోటను బద్దలు కొట్టి జగన్ ప్రభంజనంలో గెలుపు గుర్రం ఎక్కారు. ఏడాదిన్నర పాలనలో టీడీపీ ప్రజల తరపున గట్టిగా పోరాటం చేయలేకపోయింది. ఐదేళ్లపాటు కోట్లు సంపాదించిన టీడీపీ లీడర్లు ముఖం చాటేశారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతే మరికొందరు 2024లో రావచ్చులే అని బిచాణా ఎత్తేశారు. దీంతో పార్టీను అంటిపెట్టుకున్న కొద్దిమంది మాత్రమే పార్టీ వెంట నడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పట్ల గతంలో ఉన్న వ్యతిరేకత ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో నీడగా వెంటాడుతోంది. ఇదే టీడీపీ కౌన్సెలర్ అభ్యర్థులను భయపెడుతుంది. సర్పంచ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శాఖమూరి స్వర్ణలత చైర్ పర్సన్‌గా సానుకూలమే అనిపించినా గతంలో కొన్ని తప్పిదాలు.. టీడీపీ నేతలు కొందరు అతి జోక్యం పోలీస్స్టేషన్లలో పంచాయతీలు.. పోలీసులపై దురుసుగా ప్రవర్తించటం వంటివి ఇప్పుడు ప్రతికూలంగా మారాయి. అయినా వైసీపీ పట్ల స్థానికంగా ఉన్న వ్యతిరేకత తమకు కలసి వస్తుందనే ఆశలో ఉన్నారు.
వైసీపీ తరపున మండవ పిచ్చియ్య సతీమణి మండవ వరలక్ష్మి చైర్మన్ అభ్యర్థిగా బరిలో గట్టి పోటీనే ఇస్తున్నారు. అయితే గతంలో ఆ పీఠంపై కన్నేసిన వైసీపీ నేతలు కొందరు ఆమె ఓటమిని కళ్లారా చూడాలని పరితపిస్తున్నట్టుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీలో పలు వార్డుల్లో రెబెల్స్ బరిలో ఉన్నారు. కౌన్సెలర్‌గా పోటీచేయాలని ఆశపడిన లోకల్ లీడర్లు ఎంత వరకూ పోటీలో ఉన్న వారికి సహకరిస్తారనేది కూడా అనుమానమే. అయినా అరుణ్‌కుమార్ చాణక్యం.. ఓటర్లను పోలింగ్ కేంద్రానికి రప్పించటంలో తనదైన వ్యూహం వైసీపీకు ఈ సారి నందిగామ పీఠాన్ని కట్టబెడతాయనే ఆశలో ఉన్నారు. అనాసాగరం, హనుమంతుపాలెం, నెహ్రునగర్, అశోక్‌నగర్, రైతుపేట, చెర్వుబజార్, రథం సెంటర్ భిన్న కుల, మతాల సమ్మేళనం. ఇక్కడ బీజేపీ, జనసేన కూడా కొద్దోగొప్పో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ జనసేన, బీజేపీ అభ్యర్థులు ఓట్లు చీల్చితే తమకే లాభమని వైసీపీ అంచనా వేసుకుంటుంది. అదే జరిగితే.. టీడీపీ అభ్యర్థులు గెలిచేచోట కూడా ఘోరంగా ఓడిపోవాల్సి ఉంటుందంటూ వైసీపీ నేతలు అంటున్నారు.
ప్రస్తుత నందిగామ నగర పంచాయతీ ఓటర్ల అంతరంగం ఎలా ఉందనే అంశంపై కదలిక టీమ్ కొంత సర్వే చేసింది. 20 వార్డుల్లో ఆయా వర్గాల ఓటర్లను కలసి ఏ పార్టీకు అనుకూలంగా ఉన్నారనే అంశాలను గుర్తించే ప్రయత్నం చేసింది. విద్యావంతులు, ఉద్యోగవర్గాలు వైసీపీ పట్ల కాస్త వ్యతిరేకతగా ఉన్నట్టుగా కనిపించింది. అంతమాత్రాన టీడీపీను నెత్తిన పెట్టుకుంటారనే ఆలోచన కూడా కనిపించలేదు. జనసేన, బీజేపీ మున్ముందు భవిష్యత్ ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. సుమారు 400 మందిని పలుకరించినపుడు అధికశాతం వైసీపీకే అవకాశం ఉంటుందని.. అయితే.. పూర్తిస్థాయి మెజార్టీ రాకుండా వైసీపీ 12-14, టీడీపీ 6-7, జనసేన బీజేపీ 2-3 వరకూ వార్డులు గెలిచే అవకాశాలు సర్వేలో పాల్గొన్న వారి అంతరంగాన్ని బట్టి కదలిక టీమ్ విశ్లేషించింది.



