సినిమా.. వినోదాన్ని పంచేవి మాత్రమే కాదు. లక్షలాది మందికి ఉపాధి కూడా. ఏడాదిపాటు ఎంతోమంది సినీ కార్మికులు పస్తులున్నారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ క్రైసిస్ పేరుతో 9 నెలల పాటు సినీ కార్మికులకు పచారీ సరుకులు అందజేశారు. ఉచితంగా కరోనా టీకా ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి తెలుగు సినీ పరిశ్రమను కరోనా రెండో వేవ్ వెంటాడుతుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా భారినపడ్డారు. క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. అంతకు ముందు నివేదిత కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వకీల్‌సాబ్ యూనిట్‌లో దిల్‌రాజు, నివేదిత, పవన్ … పవర్‌స్టార్ బాడీగార్డ్స్ కూడా మహమ్మారి వల్ల క్వారంటైన్‌కు చేరారు. తాజాగా సోనుసూద్ కూడా కరోనాకు గురయ్యారు. ఆచార్య షూటింగ్ లో చిరంజీవి, రామ్‌చరణ్ తో కలసి నటించిన ఆయన మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్దరించారు. ఎప్ 3 షూటింగ్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. తెలుగు సినిమా క్రమంగా కోలుకుని సినిమాలు విడుదల చేస్తుంది. థియేటర్ల వద్ద క్రాక్, ఉప్పెన, అరణ్య, వైల్డ్‌డాగ్, జాతిరత్నాలు వంటి హిట్లతో దూసుకెళ్తుంది. రాబోయే వేసవిలో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ఆచార్య సిద్ధమవుతుంది. మే 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్‌తో చాలామంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు కొవిడ్ భారిన పడుతున్నారు. గాలిద్వారా కూడా వైరస్ సోకుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేళ సినిమా థియేటర్లపై కూడా దాని ప్రభావం ఉంటుందనే ఆందోళన నెలకొంది. ఇవన్నీ మున్ముందు సినీరంగాన్ని ప్రభావితం చేస్తాయని సినీవర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి.. కరోనా మరోసారి తెలుగు సినీ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తుందనే భయం కూడా లేకపోలేదు.



