జ‌గ‌న్‌.. కేసీఆర్‌కు ఉప ఎన్నిక‌ల రిఫ‌రెండ‌మా!

తెలుగు సీఎంల‌కు రెండేళ్లుగా ఎల‌క్ష‌న్ టెన్స‌న్ వేధిస్తోంది. తెలంగాణ‌లో దుబ్బా, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు తెలంగాణ ఓట‌ర్లు ఊహించిన షాక్ ఇచ్చారు. త‌న‌కు తిరుగులేద‌ని భావించిన కేసీఆర్‌కు అదంతా ట్రాష్ అని తీర్పునిచ్చారు. ఇప్పుడు నోముల న‌ర‌సింహం మ‌ర‌ణంతో నాగార్జున‌సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రిగింది. అక్క‌డ 86.80శాతం ఓటింగ్ అన్ని పార్టీల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ ఎస్‌ను అనుకూల‌మా.. ప్ర‌తికూల‌మా అనేది తేల్చుకోలేని ప‌రిస్థితిలోకి నెట్టేశాయి. వాస్త‌వానికి అక్క‌డ బీజేపీ పాగా వేయాల‌ని ప‌క్కా ప్లాన్ వేసుకుంది. దుబ్బాక ఫ‌లితం అక్క‌డ రిపీట్ చేయాల‌ని బండి గ‌ట్టిగానే భావించారు. కానీ అది కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల కంచుకోట‌. అక్క‌డ పాగా వేయ‌టం టీఆర్ ఎస్ వ‌ల్ల‌నే కాలేద‌నేది అర్ధం చేసుకుంది. అందుకే.. సీరియ‌స్‌గా తీసుకోలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం జానారెడ్డిని బ‌రిలో నిలిపి పెద్దాయ‌న అసెంబ్లీకు పంపాల‌నే సంకేతాన్ని జ‌నంలోకి పంపి స‌క్సెస్ అయింది. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ చేసేందుకు నోముల న‌ర‌సింహం త‌న‌యుడు కే సీటు కేటాయించిన టీఆర్ ఎస్ బారీ మెజార్టీతో గెలుపు ఖాయం అనుకుంటుంది. జానారెడ్డిపై పై చేయి సాధించ‌టం ద్వారా రాబోయే రోజుల్లో న‌ల్గొండ జిల్లాలో గులాబీ జెండాకు తిరుగులేద‌ని చెప్పాల‌నే ప్ర‌య‌త్నం చేస్తుంది.

తిరుప‌తి ఉప ఎన్నిక‌.. సిట్టింగ్ ఎంపీ మ‌ర‌ణంతో అక్క‌డ ఎన్నిక అనివార్య‌మైంది. అయితే అక్క‌డ శ‌నివారం పోలింగ్‌లో ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు మీడియాలో బ‌ట్ట‌బ‌య‌లైంది. క‌డ‌ప నుంచి బ‌స్సుల్లో వ‌చ్చిన వేలాది మంది దొంగ ఓట్లు వేశారంటూ బ‌హిరంగంగా టీడీపీ, బీజేపీ బ‌హిర్గ‌తం చేశాయి. కానీ ఇదంతా టీడీపీ డ్రామాగా మంత్రి పెద్దిరెడ్డి ఖండించారు. అక్క‌డ ఓటింగ్ చాలా దారుణంగా జ‌రిగింద‌నేందుకు చాలా నిద‌ర్శ‌నాలున్నాయి. ఓటింగ్ శాతం త‌గ్గ‌టం వైసీపీకు క‌ల‌సి వ‌స్తుంద‌నే భావ‌న‌లో ఉన్నారు ఆ పార్టీ నేత‌లు. టీడీపీ, బీజేపీ-జ‌న‌సేన ఆశ‌లు పోలింగ్ శాతం త‌గ్గుద‌ల‌తో అడియాశ‌ల‌య్యాయి. 5 ల‌క్ష‌ల మెజార్టీ అనుకున్న వైసీపీ అంత సాధించ‌క‌పోయినా గెలుపు ఖాయ‌మ‌నే ధీమాతో ఉన్నారు. రెండు చోట్ల ఓట‌ర్లు తెలుగోళ్లే.. ఎన్నిక‌ల్లో ఒక‌చోట భారీపోలింగ్ మ‌రోచోట ఓట‌ర్లు బ‌య‌ట‌కు రాక‌పోవ‌టం వెనుక ఆంత‌ర్యం అంతుప‌ట్ట‌కుండా ఉంది. వైసీపీ ప‌ట్ల మాత్ర‌మే గాకుండా టీడీపీ, బీజేపీ ప‌ట్ల కూడా ఏపీ ప్ర‌జ‌ల్లో ఒకేర‌క‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌నేది ఎన్నిక‌ల్లో పోలైన ఓట్ల ద్వారా తెలిసింద‌నే అభిప్రాయ‌మూ లేక‌పోలేదు. ఏమైనా.. ఇక్క‌డ సాధించే గెలుపు..
వ‌చ్చే మెజార్టీ 2024 నాటి ఎన్నిక‌ల్లో త‌మ గెలుపోట‌ముల‌కు రిఫ‌రెండంగానే ఇద్ద‌రు సీఎంలు అంచ‌నా వేసుకోవ‌టం కొస‌మెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here