తెలుగు ఓటర్లు.. మహా తెలివైన వాళ్లు. నిజమే సుమా..! మంచి చెడుల కన్న తమ ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నీతి, అవినీతి అనేది అస్సలు పట్టని వారు ఎవరైనా ఉన్నారా! అంటే తెలుగోళ్లే అంటారు. ఓటుకు వెల కడితే చాలు… జీ హుజూర్ అనేంతగా మారిపోతారు. ఇదంతా జనం తప్పు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే… అది అవసరం. పాలకులు కూడా జనం డబ్బు అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు. పార్టీ ఏదైనా నేతలు ఎవరైనా.. అందరిదీ ఒకేదారి.. మీకు పెడతాం.. మేమూ తింటాం. ఏపీలో సికాకుళం నుంచి పులివెందుల వరకూ.. అదిలాబాద్ నుంచి మిర్యాలగూడ వరకూ తెలంగాణలోనూ ఇదే సంత. ఇటువంటి చోట కొత్త రాజకీయ పార్టీలకు పెద్దగా పని ఉండదు.. ఓట్లు వేయరనేది చెప్పకనే చెప్పినట్టయింది. ఏపీ, తెలంగాణల్లో ఉప ఎన్నికలు అధికార పార్టీలకు నల్లేరు మీద నడకగానే మారాయి. కరోనా కష్టకాలంలో రెండు ప్రభుత్వాలు చాలా దారుణంగా భంగపాటుకు గురైనా జనం మాత్రం ఆ ఇద్దరికే ఓటేశారు. మీరు తప్ప మాకెవరూ లేరనేంతగా సాగిల పడ్డారనేది కనిపిస్తుంది. నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్, వైసీపీ రెండూ మాంచి దూకుడు మీద ఉన్నాయి. బీజేపీ కాస్తో కూస్తో పోటీ ఇస్తుందని అనుకున్న అంచనాలు తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో తెలుగు రాష్ట్ర ప్రజల్లో కనిపించిన మార్పు కేవలం వాపు మాత్రమే అనేది అర్ధమైంది. తిరుపతి ఉప ఎన్నికల్లో గట్టిపోటీనివ్వటం ద్వారా బీజేపీ 2024కు మార్గం వేసుకుంటుందని అందరూ భావించారు. కానీ.. అక్కడ మూడు, నాలుగో స్థానంలో ఉంటుందని ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో జనసేనకు టికెట్ కేటాయించినట్టయితే కనీసం బీజేపీ పరువు నిలిచేది.. పవన్ స్టామినా అర్ధమయ్యేది. కానీ సోము వీర్రాజు అతి విశ్వాసం కాషాయ పార్టీనే కాదు.. జనసేనను కూడా నవ్వులు పాలయ్యేలా చేసింది. బీజేపీతో పొత్తు జనసేనకు బలంగా మారుతుందనే అంచనాలు తారుమారయ్యాయి. పవన్ ఒంటరిగా పోరాడితేనే ఏపీ జనం ఆయన వైపు తిరుగుతారనేది తిరుపతి ఉప ఎన్నిక ద్వారా వెల్లడైంది. ఇప్పటికైనా కాషాయంతో తెగతెంపులు చేసుకుని ప్రాంతీయపార్టీగా జనసేనను మరింత బలోపేతం చేస్తే మున్ముందు గాజుగ్లాసుకు మరింత వన్నె పెంచినవారవుతారు.
ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు, నిజాయితీ పరుడు, ఆర్ధిక రాజనీతి కోవిదుడు ప్రపంచ స్థాయి జ్ఞాని , నిరంతర ప్రజాసేవకుడు చంద్రబాబు గారున్నారుగా..ఆలస్యమెందుకు.. వీరిద్దరూ కలిస్తే ఆంధ్ర కు ప్రత్యేక హోదా వస్తుంది, రైల్వే డివిజన్, విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు కరోనా మటుమాయం చేస్తారు.. ప్రతి వూరికి ప్రాజెక్ట్ కడతారు, సింగపూర్ కన్నా మంచి రాజధాని కడతారు.అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది…
ఇద్దరు మేధావుల కలయిక ..మాటలా..