గురిచూసి కొడితే ఎట్టా ఉంటదంటే.. ఈటలకు ఈట పోటు దిగినంత సమ్మగా అంటూ సెటైర్లు మొదలయ్యాయి. ఇంతకీ.. మంత్రిగా రెండుసార్లు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ సాబ్ కు ఈటలపై ఎందుకు కోపం వచ్చింది. ఒకప్పుడు తనకు పలానా వాళ్లు కుడి భుజం. . ఎడం భుజమంటూ బహిరంగ సభల్లో పొగడ్తల్లో కనిపించిన ఒక్కొకరు రాజకీయంగా దూరమవుతున్నారు. ఈ లెక్కన అధినేత మెప్పుకోలుకు దూరంగా ఉండటమే క్షేమదాయకమంటూ గులాబీ దళంలో గుసగుసలు. పోన్లే.. అయిందేదో అయింది.. అప్పట్లో నాయిని.. ఇప్పుడిలా ఈటెల అనుకుంటున్నారు. నిజమే.. ఈటల కూడా రెండోసారి మంత్రి అయ్యాక ఎందుకో కుర్చీలో ఇబ్బంది కూర్చుంటున్నట్టున్నాడు. తనకు పదవి ఊరకనే ఇవ్వలేదని. కోట్లాడి సాధించానంటూ ఆనాడే చెప్పాడు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చినప్పటి నుంచే ఈటెలకు సమ్మెటపోటు మొదలైందనే టాక్ కూడా లేకపోలేదు. ఏమైనా తిడితే పడాలే.. కొడితే కొట్టించుకోవాలే అనేదానికి భిన్నంగా ఈటల వైరిస్వరం అధినేతకు గట్టిగానే కోపం తెప్పించింది. అంతే.. రాత్రికి రాత్రే ప్లాన్ షురూ. తెల్లారేకల్లా వేటు.. ఇదీ కళ్లెదుట జరిగింది. మరి తెర వెనుక ఈటల ఏం చేస్తున్నాడు.
దీనిపై సర్కారు గట్టిగానే నిఘా పెట్టినట్టుంది. ఇటీవల 9 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. దీనికి దానికీ ఏం సంబంధం అనుకోవద్దు. ఎందుకంటే.. వారంతా ఈటెలకు అనుకూలమైన అధికారులుగా ముద్రపడటమే. ఇదంతా ప్రచారమో.. లేకపోతే నిజమా అనేది నేతలకే తెలియాలి. ఈ సంఘటన తరువాత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అదేనండీ.. ఈటలకు ముందు కేసీఆర్ పెత్తనంపై గట్టిగా మాట్టాడి.. కాంగ్రెస్ లోకి చేరిన గులాబీ నేత. ఈటలను కలసిన విశ్వేశ్వర్‌రెడ్డి నా ఫుల్ సపోర్టు నీకేనంటూ సెలవిచ్చారట. ఎందుకిలా కలిశారంటే.. ఈటల నాకు బంధువంటూ తేల్చిపారేశారు. రేవంత్‌రెడ్డి కూడా ఓ కాపు కాసే పనిలో పడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఈటల కదలికలను గమనిస్తున్నాయి. షర్మిలమ్మ పెట్టబోయే కొత్తపార్టీలో ఈటల చేరితే మాంచి పదవే ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈటల కూడా ఈ మధ్య తాను వైఎస్ ను అప్పట్లో పలుమార్లు కలిశానంటూ చెబుతూ వచ్చారు. ఇకపోతే.. ఈటల తరువాత గులాబీ దళం నుంచి బయటకు వచ్చే మరో నేత ఎవరు? కేసీఆర్ మెచ్చిన.. కేటీఆర్‌కు నచ్చని ఆ నాయకుడు ఎవరు అనేదానిపై పార్టీ వర్గాల్లో ఫుల్ చర్చ మొదలైందట. అంతే.. అందరి కళ్లు తరువాత ఎవరనగానే హరీష్‌రావు వైపు పోతున్నాయట. మరి ఇదంతా ఊహాగానాలా.. నిజంగానే హరీషన్నను బయటకు పంపుతారా! అనేది ఇప్పటికైతే సస్పెన్స్.