మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ మా… సినీ నటుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో పురుడుపోసుకున్న సంస్థ. టాలీవుడ్ పెద్దగా దాసరి ఉన్న సమయంలో చిన్నపాటి గొడవలు , తగాదాలు పరిష్కరించేవారు. ఇప్పుడు ఆ స్థానంలో చిరంజీవి రావటం తెలుగు తారలు కొందరికి కంటగింపుగా మారింది. చిరంజీవి చేసే ప్రతి కార్యక్రమాన్ని చిన్నదిగా చూపుతూ సాకులు వెతుకుతూ ట్రోలింగ్ చేస్తున్న పేద్దలు ఉన్నారు. వాళ్ల చిన్నబుద్దులు పట్టించుకోనంటూ మెగాస్టార్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఖైదీ నెంబరు 150, సైరాలతో తన స్టామినా చూపిన చిరంజీవి ఇప్పుడు ఆచార్యతో బిజీగా ఉన్నారు. వాస్తవానికి కరోనా లాక్‌డౌన్ లేకపోయినట్టయితే ఇప్పటికే ఆచార్య విడుదలై ఉండేది. మరో వైపు చిరంజీవి వైసీపీలో చేరతారని.. ఆయనకు ఎంపీ పదవి ఇస్తారంటూ కొన్ని మీడియా సంస్థలు మెగా ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. రెండేళ్లకోసారి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవటం ఆనవాయితీ. అయితే ఇక్కడ చిరంజీవి మాట నెగ్గుతూ వస్తుంది. ఇన్నేళ్లుగా. మెగాఫ్యామిలీ సపోర్టు చేసిన వారే గెలుస్తూ వస్తున్నారు. శ్రీకాంత్, శివాజీరాజా, నరేష్ ఇలా ఎంతోమంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
2021లో జరిగే మా ఎన్నికల్లో మెగాఫ్యామిలీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ఇస్తున్నట్టు నాగబాబు ప్రకటించటం చర్చనీయాంశమైంది. గతంలో శ్రీకాంత్, నరేష్, తరువాత రాజశేఖర్ జీవితలు మూవీ అసోసియేషన్‌లో రచ్చ చేశారు. రాజశేఖర్ వేదికపై స్టార్‌లను నిలదీయటం అప్పట్లో సంచలనమైంది. ఇదంతా కావాలనే చేశారనేది కూడా తెలిసొచ్చింది. కేవలం చిరంజీవి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇటువంటి కుయుక్తులు పన్నుతుంటారనేది కూడా బహిర్గతమైంది. ఇప్పుడు మరోసారి చిరంజీవి కుటుంబం మద్దతు ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌పై ఎలాంటి వివాదాలు తీసుకొస్తారనేది ఆసక్తిగా మారింది. చిరంజీవి ప్యానల్‌కు వ్యతిరేకంగా ఈ దఫా ఎవరు బరిలో ఉంటారు.. తెర వెనుక వారికి ఎవరు సపోర్టు చేస్తారనేది కూడా టాలీవుడ్‌లో చర్చగా మారింది.