ఒక పట్టాన వదలరు. వదిలించుకుందామంటే మరింత బలపడుతున్నారు. తలచుకుంటే ఏమైనా చేయగల సత్తా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. పంటికింద రాయి.. చెవిలోన జోరీగ లెక్కన.. సొంతపార్టీ నేతలు కొందరు జగన్‌ను మరింత ఇరుకున పెడుతున్నారు. దిక్కారమున్ చేతునా అంటూ.. అధినేత ఆదేశాలకు ఇసుమంత విలువ కూడా కట్టట్లేదు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉన్నది నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. దాదాపు రెండు నెలలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయనలో ఎందుకింత అసహనం పెరిగిందనేది పక్కనబెడితే. సొంతపార్టీ నేతలు, మంత్రులను పూచికపుల్లగా తీసిపారేస్తున్నారు. అదేనోటితో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దయగల ప్రభువు.. మంచి మనిషి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణానికి విరాళం కూడా ప్రకటించారు. ఇవన్నీ ఆయన వ్యక్తిగతమే అయినా.. వైసీపీ శ్రేణులకు మాత్రం ఏం చేయాలో పాలుపోకుండా ఉంది. చర్యలు తీసుకునేందుకు షోకాజ్ నోటీసులు జారీచేసినా.. సాంకేతిక సమస్యలను వెలెత్తి చూపి మరీ పార్టీ పరువు తీశారు. ఇకపోతే.. మరో నలుసు.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్.ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టుకు వెళ్లిన వైసీపీ సర్కార్‌కు మొట్టికాయలు తప్పలేదు. దీంతో కష్టమనిపించినా ధర్మాసనం ఆదేశాలతో మౌనం వహిస్తున్నారు. కానీ.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 67 కేసుల్లో హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకున్న ప్రభుత్వానికి.. అంతర్గతంగా మరికొందరు నేతలు చికాకు పుట్టిస్తున్నారట. వారిని బతిమాలో.. బెదిరించో దారికి తెచ్చుకోవాలనేది పార్టీ వర్గాలకు తలనొప్పిగా మారిందట.



