కష్టం వచ్చినపుడే మనలో సామర్థ్యం తెలుస్తుందంటారు పెద్దలు. నిజమే… మన తాతలు. తండ్రులు ఎన్ని కష్టాలు చవిచూసి ఉంటారు. పండిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్లు, వరదలతో కొట్టుకుపోతే ఎంత బాధపడి ఉంటారు. వ్యాపారాలు కలసిరాక ఎంతగా మదనపడ్డారో. చుట్టూ అప్పులు.. పలుకరించిన బంధువులు. సాయం చేయని స్నేహితులు. ఎన్ని అవమానాలు చవిచూసి ఉంటారు. బిడ్డకు జ్వరమొస్తే.. ఇంట్లో ఉన్న నాలుగు బస్తాల వడ్లు అమ్మిన తల్లులెందరో. కూతురు ముచ్చట తీర్చేందుకు పాడిగేదెలను అమ్మిన తండ్రులున్నారు. ఇవన్నీ వారిని ఏ రోజూ బాధపెట్టలేదు. ఉన్ననాడు తిన్నారు. లేనిరోజు పస్తులున్నారు. అభిమానం.. ఆత్మాభిమానం రెండింటి తోపాటు.. అసలు సిసలైన స్నేహితుడుని మాత్రం వదలుకోలేదు.. ఆ మిత్రుడే ధైర్యం. ఇప్పుడున్న క్లిష్టమైన సమయంలో మనం నేర్చుకోవాల్సింది.. స్నేహం చేయాల్సింది.. కేవలం ధైర్యంతోనే. ఎస్.. అదే ఇప్పటి కష్టాలను గట్టెక్కించి.. మనసుకు బలాన్ని ఎదురయ్యే కష్టాలను తట్టుకునే శక్తినిచ్చే అపురూప నేస్తం. 36 ఏళ్ల ఓ వ్యక్తి.. ఎంచక్కా ఉద్యోగం చేసుకుంటూ.. 2, 4 ఏళ్ల పిల్లలు, భార్యను అపురూపంగా చూసుకుంటున్నాడు. 22 రోజుల క్రితం పిడుగులాంటి వార్త.. జ్వరంతో మొదలైన మహమ్మారి.. రెండ్రోజుల్లో నే రుచి, వాసన దూరం చేసింది. ఆ తరువాత వైద్యపరీక్షల్లో కరోనా అని తేలింది. అయినా.. ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. భార్యపిల్లల్ని కంటికిరెప్పలా చూసుకుంటూ.. ఎప్పటికప్పుడు వైద్యుల సూచనతో మందులు వేసుకుంటూ.. వెళ్లాడు. పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు. మరో వ్యక్తిదీ అదే పరిస్థితి. ఆయుర్వేద మందులు, వేపచెట్టు గాలి, తులసి మాత దీవెన.. కషాయం ఇవన్నీ అతడిని కేవలం 10 రోజుల్లో ఆరోగ్యంగా మార్చేశాయి. వీటిని మించి ఈ ఇద్దరి స్నేహితుడు.. ధైర్యం వెన్నంటి ఉంది. అర్ధరాత్రి ఉలిక్కిపడి నిద్రలేచినపుడు .. ఏం కాదు.. నేనున్నానంటూ భరోసానిచ్చింది. ఎప్పుడైనా మనసులో భయం మొలకెత్తితే. బయటకు లాగి తొంచేసింది. అంతటి అపురూపమైన బంధువు ధైర్యం మాత్రమే. స్నేహితులు దినోత్సవం సందర్భంగా అందరికీ చెప్పేది ఒక్కటే.. కరోనా నాకు రాదు అనుకోవద్దు. వస్తే..అమ్మో అని భయపడవద్దు. వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వైరస్ పలుకరించి వంట్లోకి చేరినా.. వైద్యుల సలహా.. వెన్నంటి ఉండే ధైర్యాన్ని ఏ మాత్రం వీడొద్దు. ఎందుకంటే.. కష్టం వచ్చిన ప్రతిసారీ మనలో ఉంటూ.. మనకు ఆత్మవిశ్వాసం పంచే ఏకైక నేస్తం ధైర్యం మాత్రమే. భయమే నీ శత్రువు. భయమే నీ మృత్యువు. కాబట్టి.. ధైర్యమే నీ మిత్రుడు అనే మాట గట్టిగా నమ్మండి.