మహానేత, ప్రజానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిపై ఉన్న అపారమైన అభిమానంతో, ఆయన పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అరుదైన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్ రాజుగారు. ఎన్టీఆర్ గారిపై ఉన్న భక్తితో జీవితమంతా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టిన నిజమైన వీరాభిమాని ఆయన.
శ్రీ ఎన్టీఆర్ రాజుగారు నేడు తిరుమలలో శివోహమయ్యారు. రెండు పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు సభ్యులుగా నియమితులై, భక్తుల సేవలో బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించారు. దేవస్థానాల పరిపాలనలో నిష్కల్మషంగా సేవలందించిన ఆయన పాత్ర చిరస్మరణీయమైనది.
ఎన్.టి.ఆర్. గారికి ఆల్ ఇండియా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ, పార్టీ కోసం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశారు. పదవుల కోసం కాకుండా, ఆశయాల కోసం పనిచేశారు. శాసనసభ సభ్యునిగా అవకాశం వచ్చినప్పటికీ, “ఎన్.టి.ఆర్. గారి అభిమాని గానే ఉండటం చాలు” అని ఆ గౌరవాన్ని వినయంగా తిరస్కరించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది.
ఆయన మరణ వార్త తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు “తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు B. రామచంద్ర రాజు గారి మరణం విచారకరం. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారికి వీరాభిమానిగా, అఖిలభారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేసి ‘ఎన్టీఆర్ రాజు’గా పిలిపించుకున్న రామచంద్ర రాజు పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తూ… వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
“ఎన్టీఆర్ గారి వీరాభిమాని, అఖిలభారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు బి. రామచంద్ర రాజు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో అన్నగారి అభిమానులందరికీ ఎన్టీఆర్ రాజుగా సుపరిచితం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అంటూ లోకేష్ గారు ట్వీట్ చేశారు.
సాయి మాధవ్ బుర్రా గారు ఆయన మరణం పట్ల చింతిస్తూ “రాజుగారు శతజయంతికొచ్చిన జ్ఞాపకాలు జీవితాంతం పలకరిస్తూనేవుంటాయ్.. అభిమాని ఖర్చుపెట్టాలి కానీ అభిమానికి ఖర్చుపెట్టటమేవిటీ అని రాజుగారు ఆరోజు అన్న మాటలు ఇంకా వినిపిస్తూనేవున్నాయ్.. ఒక్క రూపాయి కూడా కమిటీ చేత ఖర్చు పెట్టించలేదు.. రామారావుగారిని అభిమానించటం తెలుగువాడి బాధ్యత, ఆయన కోసం నిలబడటం ధర్మం, తలపడటం న్యాయం, తెలుగువాడ్ని అని చెప్పుకోవటానికి రామారావుగారిని అభిమానించటమే ఒక అర్హత అని తెలిసేలాచేసిన ఎన్టీఆర్ రాజుగారి లాంటి అభిమానులకి సంస్కృతి ఋణపడివుంటుంది” అన్నారు.
https://x.com/ncbn/status/2001130562657116184?s=48



