నేటి రాజకీయాల్లో చాలా మంది నాయకుల వారసులు నేరుగా ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్లు ఆశిస్తుంటారు. కానీ, యువనేత చింతకాయల విజయ్ ఆలోచనా విధానం ఇందుకు పూర్తి భిన్నం. ఆయనకు పదవుల కంటే కార్యకర్తల్లో ధైర్యం నింపడం, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు గరిష్ట స్థాయికి చేరి, కార్యకర్తలను భయపెట్టి అణచివేయాలని చూసిన క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శం. ఎవరూ ముందుకు రావడానికి సాహసించని సమయంలో విజయ్ తన సొంత తమ్ముడిని వార్డు మెంబర్‌గా పోటీ చేయించారు. ఉన్నత విద్యావంతుడు, పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. “మేము మీతోనే ఉన్నాం, చిన్న పదవైనా సరే కలిసి పోరాడతాం” అని కార్యకర్తలకు ఆచరణలో నిరూపించారు. నారా లోకేష్ గారితో కలిసి సోషల్ మీడియా కార్యకర్తలను ముందుండి నడిపించారు. వారిపై నమోదైన కేసుల విషయంలో పార్టీ అధిష్టానంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, లాయర్ల ద్వారా అండగా నిలబడి న్యాయపోరాటం చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే తెలంగాణ, బిహార్, హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ నెలలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబుల పదవీకాలం త్వరలో ముగుస్తుంది. ప్రస్తుత శాసనసభ సంఖ్యాబలం దృష్ట్యా అధికార కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) కే ఈ నాలుగు సీట్లు దక్కడం ఖాయం.
ఈ నాలుగు సీట్లలో టీడీపీకి రెండు దక్కే అవకాశం ఉండగా, వాటిలో ఒకటి సానా సతీష్‌కు రెన్యూవల్ అవుతుందని తెలుస్తోంది. ఇక మరో సీటు కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ రేసులో చింతకాయల విజయ్, కీలారు రాజేష్ వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన చింతకాయల విజయ్ పేరు ఈ రేసులో అన్నింటికంటే ముందుందని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
రాజ్యసభ రేసులో చింతకాయల విజయ్‌కు అనేక సానుకూలతలు ఉన్నాయి. ప్రథమంగా బహుభాషా ప్రావీణ్యం ఆయనకు కలిసొచ్చే అంశం. జాతీయ స్థాయిలో మాట్లాడేందుకు వీలుగా ఆయన హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు. లోతైన రాజకీయ, విషయ పరిజ్ఞానం ఆయనకు అతిపెద్ద ప్లస్ పాయింట్. వీటికి తోడు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే బలమైన సంకేతాన్ని పంపే దిశగా ఆయన్ని పెద్దల సభకు పంపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కులాలు, ప్రాంతాలు, సామాజిక సమతుల్యత వంటి సమీకరణాలు కూడా ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి.
పార్టీ కష్టకాలంలో నమ్మకస్తుడిగా, కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిన విజయ్‌కు ఈ దఫా రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి!



