ఏపీలో టీడీపీ నిలబడాలంటే బీసీలే ఆధారం. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ వెనుకవడిన వర్గాలే వెన్నంటి ఉన్నాయి. కానీ ఆ తరువాత రాజకీయ సమీకరణల్లో కమ్మ,కాపు, రెడ్డి ప్రాధాన్యతలతో బీసీలు సైకిల్ దిగారు. మళ్లీ వారందిరీ ఏకతాటిపైకి తీసుకురావటం ద్వారా 2024లో అధికారం చేపట్టాలనే వ్యూహంతో టీడీపీ ఎత్తులు వేస్తుంది. వైసీపీ కూడా ఇటీవలే కులాల వారీగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. నామినేటెడ్ పోస్టులతో బీసీ వర్గ నేతలంతా ఖుషీ అయ్యారు. కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించి అందర్నీ ధనవంతులు చేయాలనేది వైసీపీ ప్రణాళిక అంట. తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా బీసీలకు ముఖ్యంగా కుల వృత్తుల వారికి గొర్రెలు, బర్రెలు, చేపలు ఇలా పంపిణీ చేస్తూ వాళ్లందరినీ కోటీశ్వరలను చేయాలని కంకణం కూడా కట్టుకున్నారు. ఇప్పటికే ఆయా వర్గాలన్నీ అరకోటీశ్వరులుగా మారారట. ఇదే లెక్కలో ఏపీలో బీసీ వర్గాలు కూడా రాబోయే రోజుల్లో లక్షాధికారులు కావాల్సిందేనట. అందుకే.. వైసీపీ బీసీ మంత్రం పటిస్తుంది. దీనికి తగినట్టుగా.. ఏపీ పీఠమే బీసీలకు ఇచ్చామంటూ చంద్రబాబు గర్వంగా ప్రకటించారు. చినబాబు లోకేష్‌బాబు కూడా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్.. ఏపీ అధ్యక్ష హోదాలో అచ్చెన్నాయుడు ఇద్దరూ ఇక మీద ప్రజాపోరాటాల్లో మునిగితేలటమే మిగిలింది.
ఇక్కడ కొత్తగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు గురించి ప్రస్తావించుకోవాలి. నిజానికి అచ్చెన్న టీడీపీ వెన్నెముక. ఫైర్‌బ్రాండ్ కూడా.. రూపం.. స్వరం రెండూ కూడా ధీటుగానే ఉంటాయి. కానీ.. ఈఎస్ఐ స్కామ్‌లో కేసులు.. జైళ్లు.. అనారోగ్యంతో ఆసుపత్రులతో బాగా ఇబ్బందిపడ్డారు. అయితే.. అవినీతి అసలు రాజకీయాల్లో అస్త్రమే కాదనేది మొన్నటి ఎన్నికల్లో ఎంతమంది జైళ్లకు వెళ్లొచ్చి.. అవినీతి.. అక్రమాస్తుల కేసుల్లో ఉన్నవారు గెలిచి గద్దెనెక్కారనేది కూడా తెలిసింది. వాళ్లతో పోల్చితే అచ్చెన్నది చిన్న కేసు అంటూ టీడీపీ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. అచ్చెన్న కూడా.. కాస్త గ్యాప్ వచ్చిందంటే… అసలు ఫైర్ లోపల అట్టాగే ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో టీడీపీ నేతలు భయపడుతున్న మాట వాస్తవమేనంటూ అంగీకరించారు. అయితే. ఇప్పటికే అచ్చెన్న వైఖరితో పార్టీకు దూరంగా ఉన్న నాయకులున్నారు. మంత్రిగా అందరినీ కలుపుకుని పోలేదనే అపవాదు ఉండనే ఉంది. మహిళా నేతల్లో అచ్చెన్న పట్ల అంతటి గురి కూడా లేదనేది బహిరంగ రహస్యం.
ఇటు కేసులు.. అటు తిరకాసులతో బీసీ వర్గాలు ఎంత వరకూ అచ్చెన్న వెంట నడుస్తాయనేది మరో పాయింట్. ఇప్పటి వరకూ కాపులను నెత్తిన ఎక్కించుకున్న టీడీపీ ఇప్పుడు ఆ వర్గాన్ని దూరంగా నెట్టడం కూడా ఆ వర్గం నుంచి వ్యతిరేకతకు కారణం కానుంది. ఇలా.. అచ్చెన్నను వెంటాడుతున్న ఇబ్బందులు ఎలా అధిగమిస్తారనేది ఆసక్తిగా మారింది. ఏమైనా.. అచ్చెన్నకు 2024 చాలా కీలకం. అదృష్టం వరించి.. టీడీపీ అధికారం చేపడితే.. ఆయన రొట్టె విరిగి తేనెలో పడ్డట్టే. మరి గ్యాప్‌ను భర్తీ చేసి సైకిల్‌ను ఎంత వేగంగా ఉరులుకు పెట్టిస్తారో చూడాల్సిందే.