ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ పై చర్యలు

– మహిళా కమిషన్ నివేదికతో కదలిక

మంగళగిరి: పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కొరఢా ఝళిపిస్తుంది. ఇటీవల కమిషన్ తమ దృష్టికి వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు పై ఇచ్చిన నివేదితో ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌సీ బోర్డు అడిషనల్ డైరెక్టర్  సుబ్బారెడ్డిని ఎట్టకేలకు ఆ పోస్టు నుంచి తొలగిస్తూ చర్యలు చేపట్టారు. ఈమేరకు ప్రాథమిక విద్య ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు  అడిషనల్ డైరెక్టర్  సుబ్బారెడ్డి తమను మూడేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని .. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు ఆరోపించారు. ఈ విషయమై ఎదురుతిరిగితే  సస్పెండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అప్పట్లో ఆందోళనలు చేశారు. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను సైతం కలిసి సుబ్బారెడ్డి పై నేరుగా ఫిర్యాదు చేశారు. అయితే, వారి ఫిర్యాదులపై స్పందన కరువవడంతో చివరి ప్రయత్నంగా రాష్ట్ర మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. కమిషన్‌ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిసి పనిచేసే చోట తామెదుర్కొంటున్న లైంగిక వేదింపులను ఏకరువు పెట్టుకున్నారు. ఈ విషయం పై సత్వరమే స్పందించిన కమిషన్ చైర పర్సన్ మహిళా ఉద్యోగినుల ఫిర్యాదుపై విచారణకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించారు. శరవేగంగా రంగంలోకి దిగిన మహిళా కమిషన్ కమిటీ విచారణ ప్రారంభించింది. బాధితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి ని సైతం కమిషన్ పిలిపించి విచారించింది. బాధిత ఉద్యోగినుల పక్షాన కొందరు పురుష ఉద్యోగులు కూడా సుబ్బారెడ్డి ప్రవర్తన, వేధింపులపై వాస్తవాలు వెల్లడించారు. విచారణలో వెలుగుచూసిన వాస్తవాధారాల ప్రకారం సుబ్బారెడ్డి లైంగిక వేధింపులు యదార్థమేనని మహిళా కమిషన్ తేల్చింది. ఈ మేరకు సుబ్బారెడ్డిని ఎస్ఎస్సీ బోర్డు అడిషనల్ డైరెక్టర్ పోస్టు నుంచి తొలగించి, అతనిపై శాఖాపరంగా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ ప్రాథమిక విద్యా శాఖకు మహిళా కమిషన్ నివేదించింది. ఈక్రమంలో సుబ్బారెడ్డి ని సదరు పోస్టు నుంచి తొలగించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. వివిధ శాఖల ఉద్యోగ బాధ్యతల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కానీ మహిళలపై ఇతర వేధింపుల సంఘటనలను సీరియస్‌గా పరిగణిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here