ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ మృతి బాధాకరమని మాజీమంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడారు.
ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తొలుత స్వామి అగ్నివేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ సమస్యలు, బాలల వెట్టిచాకిరిపై పోరాటం, ప్రాంతీయ ఉద్యమాలు తదితర అంశాలపై ఆయన తనదైన శైలిలో ఉద్యమిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటి చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సతి యాక్ట్ ,బంధు ముక్తి మోర్చా ,బాలల హక్కులు,భేటి బచావో భేటి పడావో ఆయన చేసిన ఉద్యమం లో నుండి పుట్టినవేనని వివరించారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని.. వారి మరణం ప్రపంచానికి తీవ్ర మనోవేదనకు కలిగిస్తున్నదని అన్నారు. స్వామి అగ్నివేష్ హర్యానా నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలపొందారని.. ఆర్య సభను స్థాపించారని చెప్పారు. స్వామి అగ్నివేష్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని.. శ్రీకాకుళంలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారని చెప్పారు. ఆయన బాల్యమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే గడిపినా అప్పుడప్పుడూ శ్రీకాకుళం వస్తుండేవారని.. ప్రధానంగా సోంపేట థర్మల్ ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారని, 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారన్నారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించిందన్నారు. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారని.. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన స్వామీ చిరస్మరణీయులన్నారు.
సంతాప సభలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, ఏపీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు శాంతమూర్తి, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు