అందం ఎలా ఉంటుందంటే.. ఇదిగో ఇలా అంటూ చూపేంతటి సౌందర్యం. బ్రహ్మదేవుడు.. ప్రపంచంలోని సోయగాలను ఒకేచోట కుప్పపోసిన అందాల రాశి ఐశ్వర్యారాయ్. నీలికళ్లు.. మత్తయిన చూపులు.. ఆ కళ్లలోకి చూస్తే ఇట్టే దూకేసి ఈదాలనేంత సొగసు ఆమె సొంతం. మిస్ ఇండియా కిరీటీ జస్ట్ మిస్సయినా.. మరుసటి సంవత్సరం ఏకంగా మిస్ వరల్డ్‌గా ఎంపికై తానేమిటో నిరూపించుకున్న ఐశ్వర్య 1 నవంబరు 1973లో మంగళూరులో పుట్టారు. బాల్యంలోనే మోడల్‌గా నటించి.. ఔరా అనిపించారు. పసితనంలోనే ది గ్రేట్ యాక్టరస్ రేఖ నుంచి ప్రశంసలు అందుకోవటం నిజంగా యాదృచ్ఛికమే అనుకోవాలి. ప్లాప్‌లు.. వివాదాలు.. ప్రేమలు.. పెళ్లిళ్లు.. ఇలా ఎన్నో ఇబ్బందులు.. వీటిని మించిన గాసిప్స్‌తో ఎక్కడ తడబడకుండా నిలదొక్కుకుని.. 46 ఏళ్ల వయసులోనూ.. అందానికి ఆమె నిదర్శనమంటూ ప్రతి కెమెరా అటువైపు తిరిగేలా మలచుకున్నారు.
అందాల ఐశ్వర్య తొలిసారి 9వ ఏట ఒక పెన్సిల్ యాడ్‌లో నటించారు. ఆ తరువాత మోడలింగ్‌లో సత్తా చాటుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఐశ్వర్యకు డాక్టర్ కావాలనే లక్ష్యం ఉండేదట. కానీ కాలం కలసిరాకపోవటంతో కనీసం ఆర్కిటెక్ట్ గా మారుదామనుకున్నారట. ఇవేమి ఆమెను వరించలేదు.. 1993లో మోడల్‌గా అప్పటికే ఫామ్‌లో ఉన్న అమీర్‌ఖాన్‌తో నటించటం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 1994లో మిస్ ఇండియా కాంటెస్ట్‌లో సుస్మితాసేన్ కిరీటం దక్కించుకుంటే.. ఐశ్వర్యారాయ్ రన్నరప్‌గా నిలిచారు. 1995లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచసుందరిగా ఐశ్వర్య నిలవటంతో ఒక్కసారిగా ఆమెవరో ప్రపంచానికి తెలిసింది. ఆ తరువాత తమిళంలో శంకర్ తీసిన ఇరువర్ అదేనండీ తెలుగులో ఇద్దరు సినిమాలో తొలిసారి నటిగా పరిచయమయ్యారు. అది ప్లాప్ అయినా.. అవకాశాలు మాత్రం ఆహ్వానం పలికాయి.
అదే శంకర్ డైరెక్షన్‌లో జీన్స్‌తో ఐశ్వర్యరాయ్ హిట్‌తో అభిమానులు ఫిదా అయ్యారు. హిందీ, తెలుగు సిని పరిశ్రమలు ఐశ్వర్య కాల్షీట్ల కోసం క్యూ కట్టారు. సినీ జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు చవిచూశారామె. సల్మాన్‌ఖాన్‌తో డేటింగ్‌తో విసిగిపోయిన ఆమె విడిపోయారు. తనను సల్మాన్ ఎంతగా హింసించారనే విషయాన్ని ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించేంత వరకూ పరిస్థితి చేరింది. వివేక్ ఓబేరాయ్‌తో ప్రేమాయణం ఉన్నట్టు కూడా గాసిప్స్ వచ్చాయి. అభిషేక్‌బచ్చన్ పరిచయంతో ఒక్కసారిగా ఐశ్వర్యరాయ్ జీవితం మారిపోయింది. దూమ్2 సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకూ దారితీసింది. 2007 ఏప్రిల్ 16న ఇద్దరి పెళ్లి జరిగింది. 2016లో ఐశ్వర్య దంపతులకు ఆరాధ్య పుట్టింది. ఇటీవలే కుటుంబం మొత్తం కరోనా వలలో చిక్కి.. సురక్షితంగా బయటపడ్డారు. బిగ్‌బీ అమితాబ్ కోడలిగా.. ఐశ్వర్యరాయ్ గృహిణిగా.. అమ్మగా… తనదైన పాత్రలో ఒదిగిపోయారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆమె సంస్కారం ఈ తరం నటులకు స్పూర్తి కూడా. మరి.. అంతటి అందాలభరణె.. అపురూప సౌందర్యరాశికి.. మనం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదామా!!