తాంబూలాలిచ్చాం.. తన్నుకుచావమంటూ కేంద్రం ఏపీను వదిలేసింది. వైసీపీ, టీడీపీ మద్య సాగుతున్న రాజకీయ వైరంలో తాను కేవలం ప్రేక్షకుడి పాత్ర మినహా ఏం చేయలేనంటూ చేతులెత్తేసింది. 2015 అక్టోబరు 22 తేదీ ఉద్దండరాయునిపాలెం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశారు. అంటే ఈ రోజుకు(గురువారం) సరిగ్గా ఐదేళ్లు. కోట్లాదిరూపాయల ఖర్చుతో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ విశిష్ఠ అతిథిగా.. అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని ఏమైనా ప్రకటన చేస్తారని ఆశపడిన ఏపీ ప్రజలకు నిరాశే ఎదరైంది. గంగనీరు.. యుమున మట్టితో సరిపెట్టారు. అక్కడికక్కడే రూ.100 కోట్లు అమరావతి రాజధానికి ఇద్దామని మాంచి ఊపుమీదున్న కేసీఆర్ కూడా ప్రధాని నుంచి ఏ ప్రకటన కూడా రాకపోవటంతో తాను కూడా వెనుకడుగు వేశారట. దాదాపు 29 వేల మంది రైతులు.. 34 వేల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకేముంది.. ఐదేళ్లలో రాజధాని నిర్మాణమే అనుకున్నారు. దాదాపు 14 వేల గ్రామాలకు పండగే అనుకున్నారు. సీఆర్ డీఏ ద్వారా రాజధానికి రూపమివ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. దాదాపు రూ.54 వేల కోట్ల అంచనాతో రాజధానికి శ్రీకారం చుట్టారు. కేంద్రాన్ని రూ.10వేల కోట్లు సాయం కావాలని బాబు కోరారు. దఫాల వారీగా కేంద్రం కూడా సుమారు రూ.7000 కోట్ల వరకూ ఇచ్చింది.
అలసు కథ అక్కడే మొదలైంది. వెలగపూడిలో తాత్కాలిక భవనాలంటూ కోట్లు ఖర్చు చేశారు. లండన్,అమెరికా, సింగపూర్, జపాన్ , చైనా, మలేషియా దాదాపు 20కు పైగా దేశాలను పర్యటించిన ఆ నాటి సీఎం చంద్రబాబు గొప్పగొప్ప కంపెనీలకు ఔట్‌సోర్సింగ్ ఇచ్చారు. కోట్లాదిరూపాయలు డిజైన్ల కోసం కుమ్మరించారు. ఆ మాత్రం డిజైనింగ్ నిపుణులు ఇండియాలో లేరా అనే విమర్శలూ వచ్చాయి. చివరకు బోయపాటి, రాజమౌళి వంటి వెండితెర దర్శక దిగ్గజాలను రంగంలోకి దింపి.. బాహుబలి సామ్రాజ్యాన్ని మించేలా హడావుడి చేశారు. రాజమౌళి ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశారనేది మాత్రం అడగొద్దంటూ విపక్షాలు సెటైర్లు కూడా వేశాయి. అయినా.. బాబుగారు గ్రాఫిక్ మాయాజాలంతో రోజూ అనుకూల మీడియాలో కథనాలే కథనాలు. అసలు ఇది అమరావతి కాదు.. అనేంతగా జనం నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. పక్కా ప్లానింగ్ ఉన్నట్టయితే రాజధాని నాలుగేళ్లలో అంటే.. 2019 నాటికి పూర్తయ్యేదే. అబ్బే అలా చేస్తే జనం ఓట్లేయరనే అపోహతో పోలవరం, అమరావతి రెండుకళ్ల సిద్ధాంతంగా టీడీపీ ఆచితూచి తాత్సారం చేస్తూ వచ్చింది. రెండు కీలక ప్రాజెక్టులు పూర్తిచేయలేకపోయారు. ఎన్నికలు ముంచుకు రావటంతో.. రెండు ప్రాజెక్టులు పూర్తిచేయాలంటే చంద్రబాబు సీఎం కావాలనే టీడీపీ నినాదం బెడసికొట్టింది. వైసీపీకు అనుకూలంగా మారింది. జగన్‌ను సీఎం చేసింది. అంతే.. చంద్రబాబు అమరావతి నాకెందుకు అంటూ.. మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారు.
ఆ నాడు ప్రధాని పునాది వేసిన అమరావతి కథ ముగింపునకు జగన్ ఆజ్యం పోశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ఇది మీ సొంతం విషయం.. మాకేం సంబంధం లేదంటూ తేల్చిచెప్పింది. వాస్తవానికి బాబు 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాడు. అప్పటికే నరేంద్రమోదీపై ఉన్న వ్యతిరేకత తనపై కూడా ప్రభావం చూపుతుందనే భయం కూడా బాబులో లేకపోలేదు. అయితే దానికి ఏపీ ప్రత్యేకహోదా, ప్యాకేజీ అంటూ కారణాలు చూపేందుకు ప్రయత్నించినా వీలుకుదర్లేదు. పైగా 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హస్తంతో పొత్తుతో బాబు చారిత్రక తప్పిదం చేశారు. అది 2019లో బెడసికొట్టడంతో బీజేపీకు బద్ద శత్రువుగా ముద్రవేసింది. నరేంద్రమోదీను దుమ్మెత్తి పోయటమే కాదు.. బావమరిది బాలకృష్ణతో కూడా నానా బూతులు తిట్టించారు. ఇప్పుడు బంతి బీజేపీ చేతిలో ఉండటంతో.. తన చేతికి మట్టి అంటకుండా వైసీపీను పావుగా అస్త్రం ప్రయోగించిన బీజేపీ అమరావతి తరలింపు విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.